Share News

సీఐఐ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:10 AM

పెట్టుబడుల సదస్సు కోసం జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, నగర సుందరీకరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సీఐఐ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు

పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో నగరంలో అభివృద్ధి, సుందరీకరణ పనులు

రూ.2 కోట్లతో ప్రధాన మార్గాల్లో సెంట్రల్‌ మీడియన్లు, గ్రిల్స్‌కు పెయింటింగ్‌లు

కనీసం దుమ్ము, ధూళి తొలగించకుండానే రంగులు వేయిస్తున్న కాంట్రాక్టర్లు

అడ్డా కూలీలతో పనులు

పట్టించుకోని అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పెట్టుబడుల సదస్సు కోసం జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, నగర సుందరీకరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం కాకుండా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. నాణ్యత గురించి పట్టించుకోకుండా ఏదో ఒకలా పనులు పూర్తిచేస్తే చాలనే ధోరణిలో ఉన్నారు.

పెట్టుబడిదారుల సదస్సు కోసం

ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సుకు దేశవిదేశాల నుంచి సుమారు 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే వరుసగా రెండు తుఫాన్లు రావడం, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సదస్సు ఏర్పాట్లు ముందుకుసాగలేదు. ఇటీవల జీవీఎంసీ ఎన్నికలు ముగియడంతో అధికారులు పెట్టుబడుల సదస్సు పనులపై దృష్టిసారించారు. ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలివుండడంతో పనులన్నీ పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే అదనుగా భావించిన కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యతకు పాతరేసి, తూతూమంత్రంగా కానిచ్చేస్తున్నారు.

నగర సుందరీకరణలో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి పాత ఎయిర్‌పోర్టు వరకు జాతీయ రహదారిపై సెంటర్‌ మీడియన్ల మరమ్మతులు, పెయింటింగ్‌ పనులు చేపట్టారు. దీంతోపాటు సెంటర్‌ మీడియన్‌పై ఉండే ఇనుప గ్రిల్స్‌కు రంగులు వేసే పనులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. కొత్తగా సెంటర్‌ మీడియన్లు నిర్మించినచోట ముందు ప్రైమర్‌ వేసి, ఆ తర్వాత తెలుపు, లేతగులాబీరంగు ప్రాథమికంగా వేయాలి. అనంతరం వాటిపై నలుపు, పసుపు రంగులు వేయాలి. అదే ఇప్పటికే ఉన్న సెంటర్‌ మీడియన్లు అయితే వాటిపై దుమ్ము, ధూళి పట్టేసివుంటుంది కాబట్టి, నీటితో శుభ్రం చేయించాలి. ఆ తర్వాత అప్పటికే ఉన్న నలుపు, పసుపు రంగులపై రెండుసార్లు అదే రంగులను వేయాలి. పెయింటింగ్‌ పనులు అందులో అనుభవం కలిగిన వారితోనే చేయించాలి. ఈ నిబంధనలన్నింటినీ టెండర్‌ పిలిచినప్పుడు, వర్క్‌ ఆర్డర్‌ అందజేసినప్పుడే సంబంధిత కాంట్రాక్టర్‌కు స్పష్టంగా చెబుతారు.

అయితే ఇప్పుడు నగరంలో పెయింటింగ్‌ పనులు టెండర్‌ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నాయి. డివైడర్లపై ఉన్న దుమ్ము, ధూళిని శుభ్రం చేయకుండానే పెయింటింగ్‌ వేస్తున్నారు. నిపుణులైన పెయింటర్లను కాకుండా అడ్డాకూలీలు, మహిళలను వినియోగిస్తున్నారు. నిపుణులైన పెయింటర్లకు రోజుకు రూ.1500 వరకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, రూ.600 ఇచ్చి అడ్డాల్లోని మహిళా కూలీలను తీసుకొచ్చిపనులు చేయిస్తున్నారు. వారు ఒక రంగుకు బదులు వేరొక రంగు వేస్తున్నారు. దీనివల్ల నిధులు ఖర్చు అవుతున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితం ఉండడం లేదు. అధికారులంతా సదస్సు ఏర్పాట్లలో హడావిడిగా ఉండడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Nov 11 , 2026 | 01:10 AM