పీవీసీ ధరలు పైపైకి...
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:37 AM
యుద్ధం వల్ల క్రూడాయిల్, ఎల్‌పీజీ సరఫరా తగ్గడంతో సగటు వినియోగదారులంతా ఇబ్బంది పడుతున్నారు.
సిరామిక్ వస్తువుల రేట్లు కూడా...
15 నుంచి 30 శాతం వరకూ పెరుగుదల
క్రూడాయిల్ కొరతతో తగ్గిన ముడిపదార్థాల ఉత్పత్తి
భవన నిర్మాణ పనుల నిలుపుదల
ప్లంబర్లకు ఉపాధి కరువు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
యుద్ధం వల్ల క్రూడాయిల్, ఎల్‌పీజీ సరఫరా తగ్గడంతో సగటు వినియోగదారులంతా ఇబ్బంది పడుతున్నారు. వంట గ్యాస్ లభించక చాలామంది సతమవుతున్నారు. ఇదే ముడిసరుకులు ఉపయోగించుకొని నడిచే కొన్ని పరిశ్రమలకు కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. దాంతో మార్కెట్‌లో వాటి ధరలు పెరిగిపోతున్నాయి. ఆ జాబితాలో పీవీసీ పైపులు, సిరామిక్ ఉత్పత్తులు ఉన్నాయి. వీటిని నిర్మాణ రంగంలో పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు.
గృహ నిర్మాణంలో నీటి పారుదల వ్యవస్థకు, విద్యుత్ వైర్లను రన్ చేయడానికి ఉపయోగించే పైపులు పోలివినైల్ క్లోరైడ్ (పీవీసీ)తో తయారైనవే. క్రూడాయిల్ నుంచి ఉప ఉత్పత్తులుగా వచ్చే నాఫ్తా, ఇథలీన్‌తో ఈ పీవీసీ ఉత్పత్తులు తయారవుతాయి. ఈ రెండూ క్రూడాయిల్, నేచురల్ గ్యాస్ ధరలతో సమానంగా ఉన్నాయి. అమెరికా/ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి నుంచి భారతదేశానికి వచ్చే క్రూడాయిల్ నౌకల సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో ఆయిల్ రిఫైనరీల నుంచి నాఫ్తా, ఇథలీన్ బాగా తక్కువగా వస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో పీవీసీ ఉత్పత్తులు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్‌లో వాటి ధరలు పెరిగిపోయాయి. రెండు వారాల నుంచి వీటి ధరలు 15 శాతం నుంచి 30 శాతం పెంచేశారు. డీలర్ల వద్ద నిల్వలు కూడా తగ్గిపోయాయి. దాంతో మార్కెట్‌లో కొన్ని రకాల పీవీసీ పైపులు దొరకడం లేదు.
మరోవైపు సిరామిక్‌తో తయారయ్యే టైల్స్, కమోడ్లు, వాష్ బేసిన్ల ధరలు కూడా 20 శాతం పెరిగిపోయాయి. సిరామిక్ పరిశ్రమ ఇంధనాలతో నడుస్తుంది. వివిధ రకాల సున్నాలను అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల వేడి చేయాల్సి ఉంటుంది. ఇందుకు నేచురల్ గ్యాస్ వినియోగిస్తున్నారు. దేశీయ అవసరాలకు వినియోగించే సిరామిక్ ఉత్పత్తుల్లో 90 శాతం గుజరాత్‌లోనే తయారవుతున్నాయి. యుద్ధం వల్ల వాటికి కూడా గ్యాస్ సరఫరా 50 శాతం ఆగిపోయింది. ఆ మేరకు ఆయా కంపెనీలు ఉత్పత్తులు తగ్గించుకున్నాయి. దాంతో మార్కెట్‌లో వాష్ బేసిన్లు, కమోడ్లు, టైల్స్ ధరలు భారీగా పెరిగాయి. అన్ బ్రాండెడ్ కమోడ్ ధర రూ.700 ఉండగా, ఇప్పుడు రూ.850కి అమ్ముతున్నారు. పారీవేర్ కమోడ్ ధర రూ.3,700 నుంచి రూ.4,200కి చేరింది. వాష్ బేసిన్ల ధరలు రూ.900 నుంచి రూ.1,200కు చేరాయి. ఇవన్నీ బేసిక్ మోడళ్ల ధరలు. ఇంకా వాటిలో హై క్వాలిటీ, కంపెనీలను బట్టి రేట్లు మారిపోతున్నాయి. ఫ్లష్ ట్యాంకులు, పీవీసీ వాటర్ ట్యాంకుల ధరలు కూడా పెరిగిపోయాయి. ఆకస్మికంగా ఖర్చులు పెరిగిపోవడంతో బిల్డర్లు ప్లంబింగ్ పనులన్నీ ఆపేశారు. దాంతో వ్యాపారాలు పడిపోయాయి. వేలాది మంది ప్లంబర్లకు ఉపాధి కరవైంది.
వ్యాపారాలు లేవు
ముప్పిడి శ్రీనివాసరావు, హార్డ్‌వేర్ వ్యాపారి, సీతంపేట
గత రెండు వారాల నుంచి వ్యాపారాలు బాగా తగ్గిపోయాయి. పీవీసీ పైపులు ఆర్డర్ పెడితే స్టాక్ లేదని ఇవ్వడం లేదు. అందుబాటులో ఉన్న వాటి ధరలు 30 శాతం వరకు పెంచేశారు. శానిటరీ సిరామిక్ ఉత్పత్తుల ధరలు పెంచారు. కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.