Share News

తాగునీటి వెతలకు చెక్‌

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:41 AM

జిల్లా ప్రజల తాగునీటి ఇక్కట్లు రెండేళ్లలో పూర్తిగా తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘జల్‌ జీవన్‌ మిషన్‌- అమరజీవి జలధార’ పథకం కింద జిల్లాకు రెండు భారీ వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులను మంజూరు చేసింది. మల్టీ విలేజ్‌ స్కీమ్‌ (ఎంవీఎస్‌) రూ.2,050 కోట్లతో చేపట్టే ఈ పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో 20 మండలాల్లో 1,223 గ్రామాలకు పుష్కలంగా రక్షిత నీరు సరఫరా అవుతుంది.

తాగునీటి వెతలకు చెక్‌
తాండవ రిజర్వాయర్‌

జిల్లాకు రెండు వాటర్‌ గ్రిడ్‌’ ప్రాజెక్టులు

‘జల్‌ జీవన్‌ మిషన్‌- అమరజీవి జలధార’ పథకం కింద రూ.2,050 కోట్లు మంజూరు

పరిపాలన అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం

రెండు ప్రధాన కంపెనీలకు పనులు అప్పగింత

20 మండలాల్లో 1,223 గ్రామాలకు రక్షిత నీరు

రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యం

లక్షలాది మందికి తీరనున్న దాహార్తి

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లా ప్రజల తాగునీటి ఇక్కట్లు రెండేళ్లలో పూర్తిగా తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘జల్‌ జీవన్‌ మిషన్‌- అమరజీవి జలధార’ పథకం కింద జిల్లాకు రెండు భారీ వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులను మంజూరు చేసింది. మల్టీ విలేజ్‌ స్కీమ్‌ (ఎంవీఎస్‌) రూ.2,050 కోట్లతో చేపట్టే ఈ పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో 20 మండలాల్లో 1,223 గ్రామాలకు పుష్కలంగా రక్షిత నీరు సరఫరా అవుతుంది.

వేసవిలో తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రెండు భారీ వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులను మంజూరు చేసింది. ‘జల్‌ జీవన్‌ మిషన్‌- అమరజీవి జలధార’ పథకం కింద చేపట్టే వీటి పనులు పూర్తయితే ఇంటింటికీ కొళాయి ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. నీటి కోసం కాకినాడ జిల్లా ఏలేరు, అనకాపల్లి జిల్లా తాండవ రిజర్వాయర్లను ఎంపిక చేశారు. ఏలేరు రిజర్వాయర్‌ ఆధారంగా రూ.1,550 కోట్లతో ఒక ప్రాజెక్టు, తాండవ రిజర్వాయర్‌ ఆధారంగా రూ.500 కోట్లతో మరో ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ రెండు ప్రాజెక్టు పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏలేరు వాటర్‌ గ్రిడ్‌ ద్వారా అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, పాయకరావుపేట (కోటవురట్ల మండలం మినహా), పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో 895 గ్రామాలకు; తాండవ వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ఐదు మండలాల్లో 328 గ్రామాలకు తారునీటిని సరఫరా చేస్తారు. మాడుగుల మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ వాటర్‌ గ్రిడ్ల పరిధిలో వున్నాయి.

రెండేళ్లలో పూర్తి

‘జల్‌ జీవన్‌ మిషన్‌- అమరజీవి జలధార’ పథకం కింద సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న రెండు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా విధించింది. 2011 జాభా లెక్కల ప్రకారం 12,94,579 మందికి రక్షిత తాగునీరు సరఫరా అవుతుంది. గ్రామాల్లో ఇంటింటికీ కొళాయి ద్వారా నీటిని అందిస్తారు. వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుల పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఏలేరు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సీసీ లిమిటెడ్‌, తాండవ వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పనులను మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ చేపట్టనున్నాయి. వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుల పనులు త్వరలో ప్రారంభం అవుతాయని, నిర్ణీత గడువు (రెండేళ్లు)లోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ అనిల్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. తాగు అవసరాల కోసం భూగర్భ జలాలపై ఆధారపడుతున్న వందలాది గ్రామాల ప్రజలకు ఈ వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులు వరంగా మరనున్నాయని పేర్కొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:41 AM