సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:50 AM
రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు.
ఉద్యోగులకు జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆదేశం
పాడేరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు. తన కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి అధికారి తన విధుల పట్ల అంకితభావంతోపాటు సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. రెవెన్యూ పరమైన సేవలను ప్రజలకు పక్కాగా అందించేందుకు కృషిచేయాలన్నారు. జిల్లాలోని రెవెన్యూ సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. పెండింగ్ పనులను సకాలంలో పూర్తిచేయాలని, లక్ష్యం మేరకు పనులన్నీ పూర్తి కావాలన్నారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ సేవలు అందుతున్న తీరుపై అధికారులు పర్యవేక్షణ పెంచాలన్నారు. రోజువారీ ప్రగతి నివేదికలను సమర్పించడంతో పాటు నిర్దేశించిన లక్ష్యం, జరిగిన పనుల వివరాలను విధిగా నమోదు చేయాలన్నారు. ముందస్తుగా అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరైతే, వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, రెవెన్యూ సూపరింటెండెంట్ కె.అప్పలస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.