Share News

28న పల్స్‌ పోలియో

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:52 AM

జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్‌ పోలియో ఇమ్యునైజేషన్‌ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశించారు.

28న పల్స్‌ పోలియో

ఐదేళ్లలోపు వారందరికీ తప్పనిసరిగా చుక్కలు వేయించాలి

కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌

విశాఖపట్నం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్‌ పోలియో ఇమ్యునైజేషన్‌ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమం ఏర్పాట్లపై సోమవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ 28న బూత్‌ల ద్వారా పోలియో చుక్కలు వేయాలన్నారు. అనంతరం 29, 30 తేదీల్లో ఇంటింటి సందర్శన ద్వారా మిగిలిపోయిన చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయాలన్నారు. జిల్లాలో 0 నుంచి ఐదేళ్లలోపు 1,89,712 మంది చిన్నారులు ఉన్నారన్నారు. కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 1,062 పోలియో బూత్‌లు, 62 ట్రాన్సిట్‌ బూత్‌లు, 94 మొబైల్‌ బూత్‌లు ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. ఇంటింటి సర్వే కోసం 2,004 ప్రత్యేక బృందాలు, 4,518 మంది వ్యాక్సినేటర్లు, 120 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వహించనున్నారన్నారు. ఆర్టీసీ బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్‌లో ట్రాన్సిట్‌ బూత్‌లు ఏర్పాటుచేసి ప్రయాణంలో ఉన్న చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ బి.లూసీ కార్డిలియో, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్‌ ఆర్‌.రమేష్‌తోపాటు వివిధ శాఖల అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.


సదరం పాట్లు

స్లాట్లు దొరకడం గగనం

జిల్లాలో అవకాశం లభించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర జిల్లాల్లోని ఆస్పత్రులు ఎంపిక

సుదూర ప్రాంతాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనం

స్లాట్లు పెంచాలని కోరుతున్న దివ్యాంగులు

విశాఖపట్నం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి):

వైకల్యాన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం అందించే సదరం సర్టిఫికెట్‌ పొందడం దివ్యాంగులకు సవాల్‌గా మారుతోంది. ముఖ్యంగా స్లాట్స్‌ పరిమిత సంఖ్యలో కేటాయిస్తుండడంతో బుకింగ్స్‌ ప్రారంభమైన కొద్దిగంటల్లోనే అయిపోతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రులను ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. బుకింగ్‌ సమయంలో అభ్యర్థులు తమకు సమీప ఆస్పత్రులో స్లాట్స్‌ లేకపోతే, ఆ తరువాత ఉన్న ఆస్పత్రులను ఎంపిక చేసుకోవాలి. అక్కడ కూడా లేకపోతే ఇతర జిల్లాల్లో ఆస్పత్రులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల జిల్లాకు చెందిన వందలాది మంది దివ్యాంగులు ఇతర జిల్లాల్లోని ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇతర జిల్లాలకు చెందిన దివ్యాంగులు కూడా అదే తరహాలో ఉమ్మడి విశాఖలోని ఆస్పత్రులకు రావాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో 25 ఆస్పత్రుల్లో సదరం వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. వారంలో రెండు రోజులు శిబిరాలను నిర్వహిస్తూ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు.

జిల్లాలకే కేటాయించేలా..

సదరం సర్టిఫికెట్‌ పొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. సొంత జిల్లాలోని ఆస్పత్రుల్లో స్లాట్‌ దొరక్కపోతే ఇతర జిల్లాల్లోని ఆస్పత్రులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం వచ్చినప్పుడు స్లాట్‌ బుక్‌ చేసుకోలేకపోతే మరో ఆరు నెలలపాటు నిరీక్షించాల్సి ఉంటుంది. అన్ని నెలలపాటు నిరీక్షించలేకే చాలామంది ఇతర జిల్లాల్లోని ఆస్పత్రులను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే, సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు దివ్యాంగులను తీసుకువెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించడంపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతున్నారు. ఏ జిల్లాకు చెందిన దివ్యాంగులు ఆ జిల్లాలోనే స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. అలాగే, ప్రస్తుతం ఒక్కో ఆస్పత్రికి కేటాయిస్తున్న స్లాట్స్‌ సంఖ్యను పెంచాలి. దీనివల్ల దివ్యాంగులకు స్థానిక ఆస్పత్రుల్లోనే పరీక్షలు నిర్వహించి సదరం సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు అవకాశం కలుగుతుంది.


ప్రాణం తీసిన ఈత సరదా

గంభీరం రిజర్వాయర్‌లో యువకుడి మృతి

ఆనందపురం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి):

ఈత సరదా యువకుడి ప్రాణాల్ని బలిగొంది. స్నేహితులతో కలిసి గంభీరం రిజర్వాయర్‌లో ఈతకు దిగిన ఓ యువకుడు నీట మునిగి మృతిచెందాడు. ఎస్‌ఐ ఎం. హరీశ్‌ తెలిపిన వివరాలు ప్రకారం..సిరిపురం ప్రాంతానికి చెందిన గొట్టుముక్కల శ్రీధర చక్రవర్తి (28), జి.ప్రశాంత్‌, సౌవిక్‌ చౌదరి సోమవారం తెల్లవారుజామున సూర్యోదయం తిలకించేందుకు గంభీరం రిజర్వాయర్‌ వద్దకు వెళ్లారు. అనంతరం ఈత కొట్టడానికి రిజర్వాయర్‌లోకి దిగారు. ఇద్దరు ఒడ్డున స్నానాలు చేస్తుండగా, శ్రీధర చక్రవర్తి రిజర్వాయర్‌ లోపలకు వెళ్లడంతో మునిగిపోయాడు. స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని వారు అక్కడికి చేరుకుని వెంటనే విపత్తు నిర్వహణ బృందం, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చక్రవర్తి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి తండ్రి గొట్టుముక్కల మధుజగన్నాథరాజు ఏయూలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. చేశారు. శ్రీధర చక్రవర్తి, అతడి స్నేహితులు నగరంలోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తిచేశారని, ప్రస్తుతం ఖాళీగా ఉన్నారని ఎస్‌ఐ హరీశ్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశామన్నారు.


ప్రాథమిక విద్యా విధానం భేష్‌

ప్రపంచబ్యాంకు బృందం ప్రశంసలు

త్రినాథపురం పాఠశాలను సందర్శించిన బ్యాంకు సౌత్‌ ఆసియా వైస్‌ ప్రెసిడెంట్‌ జోహెన్నెస్‌ జట్‌ నేతృత్వంలోని బృందం

మల్కాపురం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు బృందం అభినందించింది. బ్యాంకు సౌత్‌ ఆసియా వైస్‌ ప్రెసిడెంట్‌ జోహెన్నెస్‌ జట్‌ నాయకత్వంలోని బృందం సోమవారం నగరంలోని మల్కాపురం ప్రాంతంలో గల త్రినాథపురం జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలను సందర్శించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (ఎస్‌ఏఎల్‌టీ) కార్యక్రమంలో మోడల్‌ ఫౌండేషన్‌ స్కూల్‌ సాధించిన ప్రగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. మోడల్‌ ఫౌండేషన్‌ స్కూల్‌ ప్రయాణం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి చేపట్టిన చర్యలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెద్దాడ హరికృష్ణ వివరించారు. అనంతరం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లలతో ముచ్చటించారు. పిల్లల సమగ్ర వికాసానికి తోడ్పడే ఫోర్‌ కార్నర్స్‌ లెర్నింగ్‌ స్పేస్‌ను సందర్శించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్‌ డైరెక్టర్‌ కె.నాగేశ్వరరావు, స్టాల్‌ ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ సతీష్‌, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, సమగ్ర శిక్ష ఏపీసీ జె.చంద్రశేఖర్‌రావు, ఏఎంవో జి.లక్ష్మి, సీడీపీవో నీలిమ, మండల విద్యాశాఖాధికారులు త్రినాథరావు, వెంకటరావు, ఐసీడీఎస్‌ అధికారులు, పాఠశాల విద్యాశాఖ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, ప్రథమ్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 12:52 AM