28 నుంచి పల్స్ పోలియో
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:10 AM
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు 1,97,810 మంది వున్నారని, వీరందరికీ పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 1,446 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మూడు రోజులపాటు నిర్వహణ
జిల్లాలో 1,97,810 మంది పిల్లలకు చుక్కల మందు వేయాలని లక్ష్యం
నర్సీపట్నం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు 1,97,810 మంది వున్నారని, వీరందరికీ పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 1,446 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 147 మంది సూపర్ వైజర్లు, 5,784 మంది సిబ్బందిని నియమించారు. 120 మొబైల్ టీమ్‌లను సిద్ధం చేశారు. మొదటి రోజు అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండుల్లో పోలియో చుక్కలు వేస్తారు. రెండు, మూడో రోజుల్లో ఇంటింటికి వెళ్లి మిగిలిన పిల్లలకు పోలియో మందు చుక్కలు వేస్తారు. పల్స్ పోలియో కార్యక్రమంపై డివిజన్‌ల వారీగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా టీకా అధికారి చంద్రశేఖర్‌దేవ్ మాట్లాడుతూ, 2011 తర్వాత భారతదేశంలో పోలియో కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని, భవిష్యత్తులో కూడా పిల్లలెవరూ పోలియోబారిన పడకూడదనే ఉద్దేశంతో ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రభుత్వం పోలియో చుక్కలు వేయిస్తున్నదని చెప్పారు. కాగా ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో డయేరియా లక్షణాలు కనిపిస్తే.. ఈ నెల 16వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు జింక్ ట్యాబ్లెట్స్, సిరప్, ఓఆర్‌ఎస్ ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆశా వర్కర్లు తమ పరిధిలో ఇంటింటికి వెళ్లి చిన్నపిల్లలు ఎవరైనా విరేచనాలబారిన పడినట్టు గుర్తిస్తే వీటిని అందజేస్తారని పేర్కొన్నారు.