Share News

అభివృద్ధికి ప్రజల మద్దతు

ABN , Publish Date - Nov 04 , 2026 | 02:32 AM

విశాఖ ప్రజలు అభివృద్ధి, ప్రశాంతతను కోరుకోవడం వల్లే జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఘన విజయం సాధ్యమైందని ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్‌ పేర్కొన్నారు.

అభివృద్ధికి ప్రజల మద్దతు

అందుకే కూటమికి పట్టం

సమష్టి కృషి, సమన్వయంతోనే ఈ ఫలితాలు సాధ్యం

ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్‌

విశాఖపట్నం/మహారాణిపేట, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ప్రజలు అభివృద్ధి, ప్రశాంతతను కోరుకోవడం వల్లే జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఘన విజయం సాధ్యమైందని ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్‌ పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర ప్రజలు ప్రశాంతత, పునర్నిర్మాణం, మెరుగైన పాలనను ఆకాంక్షిస్తూ ఈ తీర్పును అందించారన్నారు. కూటమిపై విశ్వాసం ఉంచి విజయాన్ని అందించిన నగర ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రారంభమైన అభివృద్ధి ప్రయాణానికి జీవీఎంసీ ఎన్నికల ఫలితాలు మరింత ఉత్సాహాన్ని అందించాయన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారన్నారు. కొన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు. దాదాపు 37 ఏళ్ల తరువాత ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, ప్రశాంత వాతావరణ పరిరక్షణే లక్ష్యంగా కూటమి నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతారన్నారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజా ప్రతినిధులు ఎలా కష్టపడతారో ఈ ఎన్నికల్లో రుజువైందన్నారు. ప్రజల ఆదరణతో విశాఖను మరింత అందంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ కూటమిని మరోసారి ఆదరించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మకుండా విశాఖ అభివృద్ధి కోసం కూటమికి పట్టం కట్టారన్నారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ డాక్టర్‌ వేపాడ చిరంజీవిరావు, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్‌లు మాట్లాడుతూ కూటమికి భారీ మెజారిటీ ఇచ్చిన విశాఖ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో ఎన్‌టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ వైస్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 02:32 AM