Share News

ప్రజాసేవే లక్ష్యం

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:24 AM

ప్రభుత్వ లక్ష్యాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజాసేవే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ మైలవరపు కృష్ణతేజ పిలుపునిచ్చారు.

ప్రజాసేవే లక్ష్యం

అభివృద్ధి కార్యక్రమాల అమలులో అలసత్వం వద్దు

నాలుగు జిల్లాల అధికారులతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ

వచ్చే నెల 15లోగా అన్ని రకాల పన్నులు వసూలు చేయాలి

విశాఖపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ లక్ష్యాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజాసేవే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ మైలవరపు కృష్ణతేజ పిలుపునిచ్చారు. సమష్టిగా కుటుంబ స్ఫూర్తితో పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఉద్యోగుల బాగు కోసం తపిస్తుంటారని, దానిలో భాగంగానే ఒకేసారి 77 మందికి సీఈవోలుగా, మరో పది వేల మందికి పదోన్నతులు కల్పించారన్నారు. పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా, ఈవో ఆర్‌డీని డిప్యూటీ ఎంపీడీవోగా హోదాగా పరిగణిస్తున్నామన్నారు. మనమంతా ఒకే కుటుంబంలా ఉండాలని ఉపముఖ్యమంత్రి సూచిస్తుంటారన్నారు. వీఎంఆర్డీఏ చిల్ట్రన్‌ ఎరీనాలో శనివారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని హెచ్చరించారు. ఈనెల 15వ తేదీకల్లా అన్నిరకాల పన్నులు వసూలు చేయాలని, ఆదాయ వనరులు మరింతగా పెంచాలని ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు జాప్యం లేకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. మధ్యలో నిలిచిపోయిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, అన్ని పనులకు సంబంధించి బిల్లులు వచ్చే నెలాఖరులోగా అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. బాగా పనిచేసిన వారికి ఎల్లప్పుడూ ప్రోత్సహం ఉంటుందని, అదే సమయంలో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. బాగా పనిచేసిన అధికారులు, పన్నులు వసూలుచేసిన పంచాయతీ కార్యుదర్శులను అభినందిస్తూ సమీక్షలో పాల్గొన్న వారితో చప్పట్లు కొట్టించారు. ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల పంచాయతీ అధికారులు ఎంఎన్‌వీ శ్రీనివాసరావు, చంద్రశేఖరరావు, పలువురు పంచాయతీ కార్యదర్శులకు కమిషనర్‌ ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. సమీక్షలో విశాఖ జిల్లా పరిషత్‌ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజకుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 01:24 AM