అరకులోయలో పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ప్రారంభం
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:17 PM
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ప్రాంతీయ ఆస్పత్రుల్లో పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో ఈ హెల్త్ ల్యాబ్‌ను కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ నుంచి వర్చువల్‌గా శనివారం ప్రారంభించారు.
విజయవాడ నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు
అరకులోయ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ప్రాంతీయ ఆస్పత్రుల్లో పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో ఈ హెల్త్ ల్యాబ్‌ను కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ నుంచి వర్చువల్‌గా శనివారం ప్రారంభించారు. ఇక్కడ ఆస్పత్రిలో ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, జనసేన అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టి చిరంజీవి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ లగుడు రాము శిలాపలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలు ల్యాబ్‌లకు సంబంధించిన గదులను అతిథులు ప్రారంభించారు. ఈ ల్యాబ్‌లో ఎన్ని పరీక్షలు చేస్తారు.. ఎంత సమయంలో చేస్తారు వంటి వివరాలను డీసీహెచ్‌ఎస్ రాము అతిథులకు వివరించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి గిరిజన కుటుంబానికి సకాలంలో వైద్యపరీక్షలు జరుపుకునేందుకు అరకులోయ ఆసుపత్రిలో రూ.1.25కోట్లతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఇకపై రోగులు ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లనవసరం లేదని, దీనివల్ల వేలాది రూపాయలు ఆదా అవుతుందన్నారు. ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబునాయుడికి దొన్నుదొర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఎంఆర్‌ఐ స్కాన్, సీటీ స్కాన్‌లు మంజూరు కావల్సి ఉందని, అవి కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని దొన్నుదొర చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మెర్సీ శరణ్య, ఏఎంసీ చైర్మన్ బొరిబొరి లక్ష్మి, టీడీపీ అరకు,డుంబ్రిగుడ మండలాల అధ్యక్షులు ఆనంద్, మహాదేవ్, వీర మహిళ దమరసింగ్ దివ్య, తదితరులు పాల్గొన్నారు.