ప్రభుత్వ సేవలపై ప్రజల అసంతృప్తి
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:12 PM
ప్రభుత్వ పథకాలు, సేవలపై క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి వస్తున్న ప్రతికూల స్పందనపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగంపై సీరియస్ అయ్యింది.
ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో ప్రతికూల స్పందన
సచివాలయాలు, సివిల్ సప్లయ్స్,
రెవెన్యూ, ఆస్పత్రి సేవలపై ప్రజలు పెదవివిరుపు
జిల్లా యంత్రాంగంపై ప్రభుత్వం సీరియస్
అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
డీఆర్‌వో, ఆర్డీవోలతో ప్రత్యేక సెల్ ఏర్పాటు
నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై
కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
పాడేరురూరల్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలు, సేవలపై క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి వస్తున్న ప్రతికూల స్పందనపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగంపై సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి శనివారం నిర్వహించిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ కాల్స్ ద్వారా సేకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్‌ని ఆదేశించింది. దీంతో శనివారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ పర్యవేక్షణ కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. దీనికి నోడల్ ఆఫీసర్‌లుగా డీఆర్‌వో అంబేడ్కర్, ఆర్డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావులను నియమించారు. సచివాలయాలు, ఆస్పత్రి సేవలు, సివిల్ సప్లయ్స్, రెవెన్యూలో ముఖ్యంగా పాస్ పుస్తకాలు, మ్యూటేషన్లు వంటి విభాగాల్లో ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు సర్వేలో తేలింది. తక్కువ రేటింగ్ వచ్చిన శాఖల క్షేత్రస్థాయి సిబ్బందిపై పర్యవేక్షణలో విఫలమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేశ్‌కుమార్ హెచ్చరించారు. రాబోయే కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చర్చించనున్నారన్నారు. ఐసీడీఎస్, నీటిపారుదల శాఖ, గిరిజన సంక్షేమ, ఆర్‌టీసీ సేవలపై వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించనున్నారన్నారు. ఫీడ్ బాక్ మెరుగుపడని పక్షంలో శాఖాపరమైన విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ప్రభుత్వ లక్ష్యం కేవలం పథకాలు అమలుచేయడం మాత్రమే కాదని, వాటి పట్ల ప్రజలు సంతృప్తి చెందుతున్నారో.. లేదో చూడడమే ప్రధానమని అధికారులకు సూచించారు. పంచాయతీ కార్యదర్శుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారులను కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.