ప్రజా బడ్జెట్
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:27 AM
నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవ ఆదాయానికి అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించామని మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. కౌన్సిల్‌లో బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇది ప్రజా బడ్జెట్ అని, దీని ప్రభావం ఆరు నెలల్లో నగరాభివృద్ధిలో కనిపిస్తుందన్నారు.
నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించాం
మధురవాడ ప్రాంతంలో రూ.1,500 కోట్లతో యూసీడీ, నీటి సరఫరా ప్రాజెక్టులు
మేయర్ పీలా శ్రీనివాసరావు
విశాఖపట్నం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి):
నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవ ఆదాయానికి అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించామని మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. కౌన్సిల్‌లో బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇది ప్రజా బడ్జెట్ అని, దీని ప్రభావం ఆరు నెలల్లో నగరాభివృద్ధిలో కనిపిస్తుందన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన పూర్ణామార్కెట్‌ను రూ.వంద కోట్లతో ఆధునికీకరించనున్నామని, మధురవాడ ప్రాంతంలో రూ.1,500 కోట్లతో యూసీడీ, నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించబోతున్నామన్నారు.గాజువాక ప్రాంతంలో రూ.250 కోట్లతో యూజీడీ నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకురాబోతున్నామన్నారు. విశాఖను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో బీచ్‌రోడ్డుతోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి భారీగా ప్రతిపాదనలు పొందుపరిచామన్నారు. యోగాంధ్ర, పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడంలో జీవీఎంసీదే ప్రధానపాత్ర అని, ఐఎఫ్‌ఆర్, మిలాన్‌లను కూడా అదేస్థాయిలో విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ పార్లమెంటు, అసెంబ్లీల్లో బడ్జెట్‌పై సభ్యులంతా చర్చిస్తారన్నారు. అలాంటి సంప్రదాయాన్ని జీవీఎంసీలో కూడా అమలు చేయడంపై ఆలోచన చేయాలని మేయర్, కమిషనర్‌లను కోరారు. ఉత్తర నియోజకవర్గ పరిధిలో 235 పనులు ప్రతిపాదనల దశలో ఉండిపోయాయని, వాటికి నిధులు కేటాయించాలని కోరారు. డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ నిధులతో దోబీఘాట్ నిర్మాణానికి ప్రతిపాదించడం సరికాదన్నారు. జీవీఎంసీ సాధారణ నిధులను ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. దీనికి టీడీపీ ఫ్లోర్‌లీడర్ గంధం శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో వైసీపీ మేయర్‌గా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీల నిధులను ఇతర ప్రాంతాల్లో వాడేశారని, తాము మాత్రం ఎస్సీ, ఎస్టీలు ఉన్న ప్రాంతాల్లోనే సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేస్తున్నామంటూ, గత బడ్జెట్ కాపీలను ప్రదర్శించారు. వైసీపీ ఫ్లోర్‌లీడర్ బాణాల శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవీఎంసీకి రావాల్సిన రూ.238 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ పీడీ అకౌంట్‌లో ఉండిపోయిందని, ఆ నిధులను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ కార్పొరేటర్ స్టాలిన్ మాట్లాడుతూ 1981లో రూ.మూడు కోట్లతో ప్రారంభమైన జీవీఎంసీ బడ్జెట్ ఇప్పుడు రూ.నాలుగు వేల కోట్లకు చేరడం గర్వించదగ్గ విషయమన్నారు. సీపీఎం కార్పొరేటర్ గంగారావు మాట్లాడుతూ రిజిస్ర్టేషన్ సర్‌చార్జి కింద రూ.170 కోట్లు వస్తుందని బడ్జెట్‌లో చూపించారని, గత ఏడాది కేవలం రూ.25 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.