పండుగలా పీటీఎం
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:54 AM
రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలోని 604 ప్రభుత్వ పాఠశాలలు, 11 జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని (మెగా పీటీఎం 4.0) పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.
ఉత్సాహంగా మెగా పేరెంట్, టీచర్ మీటింగ్స్
బడుల్లో సందడి
పెద్ద సంఖ్యలో పాఠశాలలకు తరలివచ్చిన తల్లిదండ్రులు
పిల్లల ప్రగతి, అభ్యాసన నైపుణ్యాలు గురించి తల్లిదండ్రులకు వివరించిన ఉపాధ్యాయులు
మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు
మంత్రి రాంప్రసాదరెడ్డి, ఎమ్మల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, గణబాబు, వెలగపూడి, కలెక్టర్ హాజరు
విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలోని 604 ప్రభుత్వ పాఠశాలలు, 11 జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని (మెగా పీటీఎం 4.0) పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పలుచోట్ల విద్యా సంస్థలను మామిడి ఆకుల తోరణాలు, పూలమాలలు, రంగవల్లులతో ముస్తాబు చేశారు. పాఠశాలలు, కళాశాలలకు వచ్చిన తల్లిదండ్రులకు ఆయా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు స్వాగతం పలికారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థుల ప్రగతి, హాజరు, అభ్యాసన నైపుణ్యాలు, భవిష్యత్తు కార్యాచరణ, లక్ష్యాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యా శాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాళ్లు అన్ని పాఠశాలలు/ కళాశాలల్లో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి విద్యా సంస్థల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు, డిజిటల్ విద్య, మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన బోధనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ ఎగ్జిబిషన్లు ఆకట్టుకున్నాయి. కొన్నిపాఠశాలల్లో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందించారు.
గాజువాక జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖామంత్రి ఎం.రాంప్రసాదరెడ్డి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అక్కయ్యపాలెం ఎన్జీజీవో కాలనీలోని మునిసిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, గోపాలపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పీటీఎంకు ఎమ్మెల్యే పి.గణబాబు, ఆరిలోవ జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాజరయ్యారు. అడవివరం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖకు చెందిన విద్యార్థులు ప్రపంచస్థాయికి ఎదగాలని, అందుకు తగ్గట్టుగా వాళ్లను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. నగరంలోని వన్‌టౌన్ క్వీన్ మేరీస్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి హాజరై మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అతిపెద్ద స్కూలు చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంకు పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకుడు విజయభాస్కర్ హాజరయ్యారు. కాగా నగరంలోని కృష్ణా జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశాన్ని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే అప్పటికే సమావేశం ముగించిన అధికారులు, కొత్తగా నిర్మించిన మధ్యాహ్న భోజనం హాలు ప్రారంభోత్సవాన్ని వాయిదావేశారు.
విద్యార్థుల అభ్యున్నతికి పీటీఎం దోహదం
మంత్రి ఎం.రాంప్రసాదరెడ్డి
గాజువాక, జూలై 24 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 67 లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదని మంత్రి ఎం.రాంప్రసాదరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం గాజువాక హైస్కూల్‌లో జరిగిన మెగా పీటీఎం 4.0లో ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల అభ్యున్నతికి, తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మధ్య సమన్వయానికి దోహదపడుతుందన్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించామని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.