సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మానసిక వైద్యశాల
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:25 AM
నగరంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా అప్‌గ్రేడ్ చేయడంతో పలు కోర్సుల నిర్వహణకు అవకాశం లభించింది.
అప్‌గ్రేడ్ చేసిన కేంద్ర ప్రభుత్వం
క్లినికల్ సైకాలజీ, సైకియాట్రీ సోషల్‌వర్క్ కోర్సుల నిర్వహణకు అవకాశం
ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి దరఖాస్తుచేసిన అధికారులు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలకు ప్రణాళిక
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా అప్‌గ్రేడ్ చేయడంతో పలు కోర్సుల నిర్వహణకు అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అనేక మానసిక వైద్యశాలలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా అప్‌గ్రేడ్ చేసింది. అందులో పెదవాల్తేరు మానసిక వైద్యశాల ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే రోగులకు వివిధ వైద్య సేవలను అందిస్తుండగా, వచ్చే ఏడాది నుంచి రెండు నూతన కోర్సులను ప్రారంభించేందు కు అధికారులు చర్యలు చేపట్టారు. ఎంఏ క్లినికల్ సైకాలజీ, సైకియాట్రీ సోషల్ వర్క్ కోర్సులను 30 సీట్లతో ప్రారంభించడానికి ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ రెండు కోర్సుల నిర్వహణకు అవసరమైన అనుమతుల కోసం ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆస్పత్రి అధికారులు ఇప్పటికే దర ఖాస్తు చేశారు. ఇద్దరు ఫ్యాకల్టీని డిప్యూటేషన్‌పై తెచ్చుకు నేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. కోర్సుల నిర్వహణకు అనుమతులు వచ్చిన వెంటనే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ)కు దరఖాస్తు చేసి కోర్సులను ప్రారంభించనున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామిరెడ్డి తెలిపారు. ఇకపోతే, ప్రస్తుతం కేజీహెచ్ ఆవరణలోని నర్సింగ్ కాలేజీలో నిర్వ హిస్తున్న సైకియాట్రీ నర్సింగ్ కోర్సును సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో భాగం చేయనున్నారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని సెంట్రల్ మెంటల్ హెల్త్ డివిజన్ అంది స్తోందని సూపరింటెండెంట్ వెల్లడించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో భాగంగా నిర్వహించే కోర్సుల్లో ఏటా 30 మంది విద్యార్థులు చేరతారు. వీరంతా బయటకు వచ్చిన తరువాత మానసిక వైద్య సేవలను మరింత విస్తరించేం దుకు అవకాశం ఏర్పడుతుందని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. ఈ తరహా కోర్సులను ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. అన్నీ అనుకూలించి కోర్సులు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం మానసిక వైద్యశాలే తొలి ప్రభుత్వ ఆస్పత్రిగా నిలుస్తుందని అంటున్నారు.