స.హ. చట్టం కమిషనర్‌గా పీఎస్ నాయుడు
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:31 AM
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా నగరానికి చెందిన పరవాడ సింహాచలంనాయుడు (పీఎస్ నాయుడు) నియమితులయ్యారు.
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ విజయానంద్
ఉత్తరాంధ్ర నుంచి ఎంపికైన తొలి వ్యక్తిగా గుర్తింపు
స్పీకర్‌తోసహా పలువురి అభినందనలు
విశాఖపట్నం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా నగరానికి చెందిన పరవాడ సింహాచలంనాయుడు (పీఎస్ నాయుడు) నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీచేశారు. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఉత్తరాంధ్ర నుంచి కమిషనర్‌గా ఎంపికైన మొదటి వ్యక్తి పీఎస్ నాయుడు కావడం విశేషం. ఆయన ప్రస్తుతం విశాఖ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనసాగుతున్నారు. ఉమ్మవి విశాఖ జిల్లా చీడికాడలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పీఎస్ నాయుడు.. విశాఖ జిల్లా కోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తెలుగుదేశం పార్టీలో పలు పదవులు నిర్వహించారు. 2016 నుంచి ఆరేళ్లపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా పనిచేశారు. కూటమి అధికారంలో వచ్చిన తరువాత రెండో పర్యాయం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. తాజాగా రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. రాజ్యాంగబద్ధమైన ఈ పదవిలో మూడేళ్లపాటు ఉంటారు. కాగా సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా నియమితులు కావడంతో విశాఖ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుకు ఆయన రాజీనామా చేశారు.
సమాచార హక్కు చట్టం అమలుకు కృషి
రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలు కావడానికి కృషిచేస్తానని నూతనంగా కమిషనర్‌గా నియమితులైన పీఎస్.నాయుడు అన్నారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, ప్రజల హక్కుల పరిరక్షణకు, సమాచార హక్కు చట్టం అమలులో పారదర్శకంగా వుంటానని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం నారా చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.
పలువురి అభినందన
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా నియమితులైన పీఎస్‌నాయుడుని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అభినందించారు. సమాచార హక్కు చట్టం అమలుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆకాక్షించారు. విశాఖ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కృష్ణమోహన్, పి.నరసింగరావు, కేజీఆర్. మురళి, బైపా అరుణ్‌కుమార్, ఏజీపీ కన్నూరు అప్పలనాయుడు, జ్యుడీషియల్ ఉద్యోగుల నేత పైల సన్నిబాబు తదితరులు ఆయనను అభినందించారు.