Share News

మెరుగైన వైద్య సేవలు అందించండి

ABN , Publish Date - May 03 , 2026 | 12:36 AM

కేజీహెచ్‌కు ఎంతో విశిష్టత, ప్రాముఖ్యం ఉన్నాయని, అందుకు అనుగుణంగా రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ పేర్కొన్నారు.

మెరుగైన వైద్య సేవలు అందించండి

కేజీహెచ్‌ వైద్యులకు కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశం

ఆస్పత్రి సందర్శన...

వార్డుల్లో సేవలపై ఆరా

విశాఖపట్నం, మే 2 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌కు ఎంతో విశిష్టత, ప్రాముఖ్యం ఉన్నాయని, అందుకు అనుగుణంగా రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆస్పత్రిని సందర్శించిన ఆయన వార్డుల్లో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఓపీ, క్యాజువాల్టీ, ఎమర్జన్సీ వార్డు, సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లోని ల్యాబ్‌లను సందర్శించారు. అక్కడి పరిస్థితుల గురించి వైద్యులు, సిబ్బంది, రోగులతో మాట్లాడారు. అనంతరం సూపరింటెండెంట్‌ కార్యాలయానికి వెళ్లి వైద్యులతో సమావేశమయ్యారు. అందిస్తున్న సేవలు, అక్కడున్న సమస్యలను విభాగాధిపతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వార్డుల సామర్థ్యం, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఆధునిక పరికరాల వినియోగం, ఇతర అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా విభాగాధిపతులు పలు అంశాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లగా వాటిపై సానుకూలంగా స్పందించారు. జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై త్వరలో చర్చిద్దామని, రాష్ట్రస్థాయిలో అంశాలను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణ రూపొందిద్దామని పేర్కొన్నారు. కేజీహెచ్‌కు ఎంతో పేరు ఉందని, దానికి తగినట్టుగా వైద్యులు వ్యవహరించాలన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా కృషి చేయాలన్నారు. ఓపీ వద్ద ఆస్పత్రి స్టాంపు, లోగో ఏర్పాటుచేయాలని సూచించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖరం నాయుడు, చీఫ్‌ డైటీషియన్‌ రమణమూర్తి, ఆర్‌ఎంవోలు డాక్టర్‌ బంగారయ్య, డాక్టర్‌ శిల్ప, ఇతర అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2026 | 12:36 AM