Share News

సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వాలని నిరసన

ABN , Publish Date - May 31 , 2026 | 12:45 AM

తమ సర్టిఫికెట్లు, టీసీలు వెంటనే ఇచ్చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక శ్రీవిజన్‌ ఐఐటీ, మెడికల్‌ అకాడమీ విద్యా సంస్థ ఎదుట పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు శనివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ శ్రీవిజన్‌ అకాడమీకి ప్రభుత్వ గుర్తింపు ఉందని, అన్ని సౌకర్యాలు ఉన్నాయని నమ్మిస్తే తమ పిల్లలను గతేడాది ఇక్కడ చేర్చామన్నారు. డే స్కాలర్స్‌కు రూ.60 వేలు నుంచి రూ.70 వేలు, హాస్టల్‌తో కలిపి రూ. 1.3 లక్షల నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేశారన్నారు. సబ్బవరం, కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, చోడవరం, తదితర ప్రాంతాల నుంచి సుమారు 76 మంది ఇక్కడ చదువుతున్నారన్నారు.

సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వాలని నిరసన
సబ్బవరం శ్రీవిజన్‌ అకాడమీ ఎదుట నిరసన తెలుపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

శ్రీవిజన్‌ అకాడమీ ఎదుట విద్యార్థుల ఆందోళన

- గుర్తింపు, సౌకర్యాలు లేవని ఆవేదన

సబ్బవరం, మే 30 (ఆంధ్రజ్యోతి) : తమ సర్టిఫికెట్లు, టీసీలు వెంటనే ఇచ్చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక శ్రీవిజన్‌ ఐఐటీ, మెడికల్‌ అకాడమీ విద్యా సంస్థ ఎదుట పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు శనివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ శ్రీవిజన్‌ అకాడమీకి ప్రభుత్వ గుర్తింపు ఉందని, అన్ని సౌకర్యాలు ఉన్నాయని నమ్మిస్తే తమ పిల్లలను గతేడాది ఇక్కడ చేర్చామన్నారు. డే స్కాలర్స్‌కు రూ.60 వేలు నుంచి రూ.70 వేలు, హాస్టల్‌తో కలిపి రూ. 1.3 లక్షల నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేశారన్నారు. సబ్బవరం, కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, చోడవరం, తదితర ప్రాంతాల నుంచి సుమారు 76 మంది ఇక్కడ చదువుతున్నారన్నారు. ఇందులో 30 మంది హాస్టల్‌, 46 మంది డే స్కాలర్‌ విద్యార్థులు ఉన్నారన్నారు. అయితే అకాడమీకి ఇప్పటికీ గుర్తింపు రాలేదన్నారు. ఎస్‌కేఎంల్‌ కళాశాల పేరుతో ఈ ఏడాది పరీక్షలు రాయించారని తెలిపారు. సరైన ఫ్యాకల్టీ లేదని, లేబొరేటరీ అసలే లేదని, హాస్టల్‌లో భోజనం కూడా సరిగా లేదని వాపోయారు. తమ పిల్లల ఇబ్బందులు చూడలేక ఈ ఏడాది మార్చి నుంచి సర్టిఫికెట్లు, టీసీలు ఇచ్చేయాలని అకాడమీ చుట్టూ తిరుగుతున్నా ప్రిన్సిపాల్‌ రిషీ పట్టించుకోలేదని వాపోయారు. ఈ విషయంపై ఆర్‌ఐవో వినోద్‌బాబును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నామన్నారు. శనివారం విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేయాలని ఆయన ఆదేశించినా ప్రిన్సిపాల్‌ రిషీ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఇప్పటికీ గుర్తింపు వస్తుందని నమ్మబలుకుతున్నా రని తెలిపారు. ఈ విషయమై ఆర్‌ఐవో వినోద్‌బాబును వివరణ కోరగా, రెండు మూడు రోజుల్లో సర్టిఫికెట్లు ఇచ్చేస్తారని చెప్పారు. ప్రిన్సిపాల్‌ రిషీని వివరణ కోరగా గుర్తింపు సర్టిఫికెట్‌ రావడంలో జాప్యం జరిగిందన్నారు. సర్టిఫికెట్లు కావాలన్న విద్యార్థులకు వారం రోజుల్లో ఇచ్చేస్తామని చెప్పారు.

Updated Date - May 31 , 2026 | 12:45 AM