యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను శిక్షించాలంటూ ఆందోళన
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:40 AM
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై జన సైనికులు, వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి గెడ్డం బుజ్జి ఇటీవల పాయకరావుపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పాయకరావుపేట పోలీసులు ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేసి శనివారం వేకువజామున సుమారు నాలుగున్నర గంటల సమయంలో ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌లో ఉన్న నక్కపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయానికి తరలించారు.
- నక్కపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయం వద్ద జన సైనికుల నిరసన
- రహదారి దిగ్బంధించి వంటావార్పు
ఎస్.రాయవరం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై జన సైనికులు, వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి గెడ్డం బుజ్జి ఇటీవల పాయకరావుపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పాయకరావుపేట పోలీసులు ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేసి శనివారం వేకువజామున సుమారు నాలుగున్నర గంటల సమయంలో ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌లో ఉన్న నక్కపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయానికి తరలించారు. విషయం తెలుసుకున్న గెడ్డం బుజ్జితో పాటు జనసైనికులు, వీర మహిళలు ఉదయం సుమారు 8 గంటల సమయం నుంచి అడ్డరోడ్డు జంక్షన్‌కు పెద్దఎత్తున చేరుకొని అతనిని శిక్షించాలంటూ ఆందోళన చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి జాతీయ రహదారి సర్వీసు రోడ్డును దిగ్బంధించారు. విశాఖపట్నం వైపు నుంచి అడ్డరోడ్డు జంక్షన్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను అడ్డుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించిన జనసేన నాయకులు, జనసైనికులు మధ్యాహ్నం వంటా వార్పు నిర్వహించి అక్కడే భోజనాలు చేశారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం 3:12 గంటల సమయంలో ప్రశ్న రావణ్ ముఖానికి మాస్క్ తొడిగి పోలీసు వాహనంలో ఎలమంచిలి కోర్టుకు తరలించారు. ఆ సమయంలో జనసైనికులు చెప్పులు చూపుతూ వాహనం వెంట పరుగులు తీశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు పప్పల శివ, పెనుగొల్లు పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి రెడ్డి పవన్‌కుమార్, మండల యువత అధ్యక్షుడు లింగంపల్లి జ్యోతికుమార్, పాయకరావుపేట మార్కెట్ యార్డు డైరెక్టర్ ప్రసాదుల గణేశ్, నాయకులు గొర్లి సతీశ్, తదితరులు పాల్గొన్నారు.