మహిళల రక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:48 AM
మహిళల రక్షణ అందరి బాధ్యత
యువత మొబైల్ ఫోన్లకు బానిసలు కావద్దు
ఎస్పీ అమిత్ బర్దార్
పాడేరు రూరల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): మహిళలు, పిల్లల రక్షణ విషయంలో అధికారులతోపాటు సమాజంలో ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. ఇక్కడి జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళలు, పిల్లల భధ్రతపై సీఐ డి.దీనబంధు ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన.. మహిళల రక్షణ, భద్రత, ఇంటి నుంచి బయటకు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఆపద సమయంలో ఏ విధంగా స్పందంచాలి, ఆకస్మికంగా వచ్చే ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలవల్ల కలిగే అనర్థాలు, వాటి నిషేధానికి అమల్లో ఉన్న చట్టాలు, బాల్య వివాహాలు జరిపితే చట్టపరంగా తీసుకొనే చర్యల గురించి వివరించారు. విద్యార్థులు, యువత మొబైల్ ఫ్లోనకు బానిసలు కావద్దని సూచించారు. పిల్లల మొబైల్ ఫోన్ల వినియోగంపై తల్లి దండ్రులు దృష్టి సారించాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం ఎస్పీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా నోడల్ ఆఫీసర్ జి.గౌరీశంకరరావు, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యారినులు పాల్గొన్నారు.