Share News

గృహ హింస బాధితులకు ‘రక్షణ’

ABN , Publish Date - Oct 26 , 2026 | 01:23 AM

వివిధ రూపాల్లో గృహహింసకు గురవుతున్న మహిళలకు జిల్లా గృహ హింస రక్షణ విభాగం అండగా నిలుస్తోంది.

గృహ హింస బాధితులకు ‘రక్షణ’

రెండు దశాబ్దాల్లో 4,101 ఫిర్యాదులు

490 కుటుంబాల్లో రాజీ

బాధితులకు కౌన్సెలింగ్‌, ఆశ్రయం, న్యాయ సహాయం

ఆర్థిక స్వావలంబనకు చేయూత

చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు

విశాఖపట్నం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి):

వివిధ రూపాల్లో గృహహింసకు గురవుతున్న మహిళలకు జిల్లా గృహ హింస రక్షణ విభాగం అండగా నిలుస్తోంది. ఈ తరహా సమస్యలతో వచ్చే బాధితులకు కౌన్సెలింగ్‌ నిర్వహించడం నుంచి న్యాయ సహాయం, ఆశ్రయం కల్పిస్తోంది. గృహ హింస బాధిత మహిళలకు అండగా 2006 అక్టోబరు 26న కేంద్ర ప్రభుత్వం రక్షణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం అందుబాటులోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలోని డొమెస్టిక్‌ వయలెన్స్‌ సెల్‌కు 4,101 ఫిర్యాదులు అందగా, వీటిలో 490 కేసుల్లో కౌన్సెలింగ్‌ ద్వారా రాజీ కుదిర్చారు. మిగిలినకేసుల్లో బాధితులకు న్యాయం అందించేందుకు న్యాయస్థానాల ద్వారా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

కుటుంబకలహాలకు అనేక కారణాలు..

మారుతున్న జీవనశైలి, భార్యభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, స్మార్ట్‌ఫోన్‌ వినియోగం, సోషల్‌ మీడియా అతి వినియోగం, అపార్థాలు పెరగడం, కుటుంబసభ్యుల జోక్యం, ఆర్థిక సమస్యలు వంటి కారణాలతో కుటుంబాల్లో విభేదాలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. అ పరిస్థితుల్లో డీథాల మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించడంతోపాటు కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు రక్షణ విభాగం కృషిచేస్తోంది. బాధిత మహిళల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, ఇరువర్గాల వారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. పరస్పర అంగీకారంతో రాజీ కుదురుస్తున్నారు. ఇప్పటికే న్యాయస్థానాల్లో కేసులు దాఖలైన తరువాత రాజీకి వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉంటున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

విభిన్నమైన సేవలు..

గృహ హింసకు గురైన మహిళలకు కౌన్సెలింగ్‌తోపాటు నిరాశ్రయులకుఆశ్రయం కల్పిస్తున్నారు. బాధితులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నారు. కేసుల పరిష్కారం కోసం ఎదురుచూసే సమయంలో జీవనోపాధి మార్గాలను సూచిస్తున్నారు. కలెక్టర్‌ నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలు, రాష్ట్ర మహిళా కమిషన్‌ నుంచి వచ్చిన ఫిర్యాదులపైనా విచారణ చేపడుతున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. న్యాయస్థానాలు జారీచేసిన ఉత్తర్వుల అమల్లో పోలీసుల సహకారంతో బాధితులకు అండగా నిలుస్తున్నారు. గ

ఇదీ లెక్క..

జిల్లాలో 2006 నుంచి గృహ హింస రక్షణ విభాగానికి 4,101 ఫిర్యాదులు అందాయి. వీటిలో 490 కేసుల్లో కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కారమయ్యాయి. మరో 3,611 కేసులు న్యాయస్థానాల్లో దాఖలయ్యాయి. వీటిలో 2,238 కేసుల్లో తుది ఉత్తర్వులు వెలువడగా, 53 కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీఅయ్యాయి. ప్రస్తుతం 1,278 కేసులు విచారణ లేదా ఇతర ప్రక్రియల్లో ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రానికి ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌గా సీహెచ్‌ సంతోషికుమారి, లీగల్‌ కౌన్సెలర్‌గా ఎస్‌.సరోజ, సోషల్‌ కౌన్సెలర్‌గా బీడీ జ్యోతిలత వ్యవహరిస్తున్నారు.

Updated Date - Oct 26 , 2026 | 01:23 AM