Share News

తీరానికి రక్షణ

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:35 AM

జిల్లాలో సముద్ర తీరం కోతకు గురికాకుండా ఉండేందుకు రెండేళ్లుగా విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి.

తీరానికి రక్షణ

కోత నివారణకు రూ.172 కోట్లతో ప్రాజెక్టు

కేంద్రం అంగీకారం

తాజాగా మంత్రివర్గంలో చర్చ

ఎన్‌ఐఓటీతో డీపీఆర్‌కు యత్నం

విశాఖ నుంచి భీమిలి వరకూ 30 ప్రాంతాల గుర్తింపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో సముద్ర తీరం కోతకు గురికాకుండా ఉండేందుకు రెండేళ్లుగా విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. కేంద్రం రూ.172 కోట్లు మంజూరుచేయగా, సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. దీంతో ఇది త్వరగా కార్యాచరణలోకి వచ్చే అవకాశం ఉంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తన అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉప్పాడలో సముద్రతీరం కోత నివారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు సాధించుకున్నారు. ఆ విధంగా విశాఖ జిల్లాలో ఎందుకు చేయకూడదని అప్పటి వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ విశ్వనాథన్‌ తన వంతు ప్రయత్నం చేశారు. విశాఖలో రామకృష్ణా బీచ్‌ నుంచి భీమిలి వరకు ఎక్కడెక్కడ తీరం కోతకు గురవుతున్నదో అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. వీఎంఆర్‌డీఏకు కురుసుర సబ్‌మెరైన్‌ ప్రాంతం సముద్రంలో కలిసిపోవడం, ఆ పక్కనే జీవీఎంసీ నిర్వహిస్తున్న కోకో ఎరీనాలో కొబ్బరిచెట్లు అలల ఉధృతికి పడిపోవడం, నోవాటెల్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న చిన్నపిల్లల పార్కు క్రమంగా కోతకు గురవుతున్న విషయాన్ని తన నివేదికలో పొందుపరిచారు. రుషికొండ, మంగమారిపేట, భీమిలి తోటవారి వీధి వంటి ప్రాంతాల్లో తీరం బాగా కోతకు గురవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీతో పాటు స్థానిక మత్స్యకారులతోను చర్చించారు. మొత్తం 30కి పైగా ప్రాంతాలను సంరక్షించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ప్రాజెక్టు రూపొందించి ఢిల్లీలోని నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎంఏ)కి పంపించారు. దీనికి రూ.203 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అందులో 90 శాతం కేంద్రం అందిస్తే, మిగిలిన 10 శాతం ఏపీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నుంచి తీసుకుంటామని పేర్కొన్నారు.

ఢిల్లీలో ప్రయత్నాలు

ప్రాజెక్టు నివేదిక పంపించి ఊరుకోకుండా వీఎంఆర్‌డీఏ అధికారులు పలు మార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ సెక్రటరీ, ఎన్‌డీఎంఏ అధికారులను కలిసి పరిస్థితిని వివరించారు. తీరం కోత ఫొటోలు, వీడియోలు చూపించారు. పర్యాటకంగా కీలకంగా ఉన్న విశాఖపట్నంలో తీరం కోత నివారణకు నిధులు మంజూరు చేయాలని అధికారులు కోరారు. ఆ తరువాత విశాఖ ఎంపీ శ్రీభరత్‌ దానిపై పలు మార్లు ఆయా శాఖలతో చర్చించారు. ఎట్టకేలకు కేంద్రం రూ.172 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది.

ఎన్‌ఐఓటీతో డీపీఆర్‌

వినయకుమార్‌, సీఈ, వీఎంఆర్‌డీఏ

కేంద్రం నిధుల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తరువాత విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదానికి పంపించాం. తాజాగా గురువారం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో సమగ్ర ప్రాజెక్టు నివేదికను నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ)తో తయారుచేయించాలని ఆదేశించింది. అది పూర్తయి, దానికి ఆమోదం లభిస్తే పనులు ప్రారంభిస్తాం.

Updated Date - Oct 10 , 2026 | 12:35 AM