Share News

అప్పన్న భూములకు రక్షణ

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:51 AM

సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు ఆక్రమణకు గురికాకుండా కొన్ని ప్రాంతాల్లో ప్రహరీ గోడ నిర్మిస్తామని అధికారులు కొత్త ప్రతిపాదనతో ముందుకువచ్చారు.

అప్పన్న భూములకు రక్షణ

సింహాచలం దేవస్థానం భూముల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి అధికారుల ప్రతిపాదన

గతంలో రూ.8 కోట్లతో 4.5 కి.మీ.మేర నిర్మాణం

ఇప్పుడు రూ.2.9 కోట్లతో 7.9 కిలోమీటర్ల మేర పనులు

నేడు ట్రస్ట్‌ బోర్టు సమావేశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు ఆక్రమణకు గురికాకుండా కొన్ని ప్రాంతాల్లో ప్రహరీ గోడ నిర్మిస్తామని అధికారులు కొత్త ప్రతిపాదనతో ముందుకువచ్చారు. సుమారు 9.2 కి.మీ. విస్తీర్ణంలో పనులు చేపట్టడానికి రూ.2.9 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ అంశాన్ని బుధవారం జరిగే దేవస్థానం ట్రస్టు బోర్టులో చర్చకు పెట్టారు. అయితే మొత్తం భూములకు ప్రహరీ నిర్మించకుండా ముక్కలు ముక్కలుగా ఎందుకు ప్రతిపాదనలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. దేవస్థానానికి నిధులు కొరత లేదు. వందల కోట్ల రూపాయల విలువైన భూములకు రక్షణ కోసం చేపట్టే పనులపై అభ్యంతరాలు కూడా వ్యక్తం కావు. అలాంటప్పుడు పూర్తిగా రక్షణ గోడ నిర్మించడానికి ఎందుకు నడుం కట్టడం లేదనే ప్రశ్నలు వినిసిస్తున్నాయి.

దేవస్థానానికి సర్వే నంబరు 275లో సుమారుగా తొమ్మిది వేల ఎకరాలు ఉన్నాయి. వీటిని పంచ గ్రామాలుగా వ్యవహరిస్తారు. ఈ భూముల్లో పదేళ్ల క్రితం నాటికి సుమారు 12 వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించడానికి, ప్రత్యామ్నాయంగా దేవస్థానానికి భూములు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది. ఇవి కాకుండా కొత్తగా మరి కొన్ని వేల నిర్మాణాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆక్రమణలు జరుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన భూములను కాపాడుకోవడానికి అధికారులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావడం లేదు. ఇప్పటివరకు సుమారు 15 కి.మీ. మేర ప్రహరీ నిర్మించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన ఎంపీ కోటా నుంచి రూ.5 కోట్లు, అనకాపల్లి ఎంపీ సత్యవతి రూ.3 కోట్లు ఇవ్వగా పెదగదిలి నుంచి పాత వెంకోజీపాలెంలో జ్ఞానానంద ఆశ్రమం వరకు సుమారు 4.5 కి.మీ. పొడవున ప్రహరీ గోడ నిర్మించారు. ఇంకా మిగిలిన కొండ చుట్టూ నిర్మించాల్సిన ప్రహరీకి వివిధ కార్పొరేట్‌ సంస్థల నుంచి సామాజిక సేవ కింద నిధులు సమీకరిస్తామని ప్రకటించారు. ఆ తరువాత ఆ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు.

గిరి ప్రదక్షిణ లెక్కల ప్రకారం కొండ చుట్టుకొలత 32 కిలోమీటర్లు. మధ్యలో లోపల వైపు ఉండే మలుపులు అవీ లెక్కించుకుంటే మొత్తం 40 కి.మీ. పొడవున ప్రహరీ ఉండాలి. గతంలో నిర్మించిన 15 కి.మీ. ప్రహరీ, వైసీపీ హయాంలో నిర్మించిన 4.5 కి.మీ. ప్రహరీ కలిపితే 19.5 కి.మీ. పొడవున రక్షణ గోడ ఉంది. ఇంకా 20.5 కి.మీ. పొడవున ప్రహరీ నిర్మించాల్సి ఉంది. దేవస్థానం అధికారులు ఏ లెక్కలు వేశారో తెలియదు గానీ ఇప్పుడు రూ.2.5 కోట్లతో ఒక ప్రాంతంలో 7.9 కి.మీ. పొడవున ప్రహరీ గోడ నిర్మిస్తామని బోర్డుకు సమర్పించిన అజెండాలో ప్రతిపాదించారు. అదే విధంగా ఖాళీ స్థలాల చుట్టూ 1,300 మీటర్ల మేర ఆరు అడుగుల ఎత్తున ప్రహరీ నిర్మాణానికి మరో రూ.40 లక్షల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. అంటే ఇంకా ప్రహరీ నిర్మించాల్సిన ప్రాంతం పది కి.మీ.పైనే ఉంటుంది. సీతమ్మధార, మాధవధార, నరసింహనగర్‌, అడవివరం ప్రాంతాల్లో ఇప్పటికీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కొందరు లేఅవుట్లు వేసుకున్నామని కోర్టుల నుంచి డిక్రీలు తెచ్చుకొని సొంత ప్రహరీలు నిర్మించుకుంటున్నారు. సర్వే నంబరు 275కి అనుబంధంగా 275/1, 2 అంటూ నంబర్లు వేసుకొని భూములు వారి ఆధీనంలో ఉంచుకున్నారు. ఇప్పటికైనా పూర్తిగా భూములకు ప్రహరీ నిర్మించి, వాటికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Sep 30 , 2026 | 12:51 AM