వర్షాభావం నుంచి పంటలను కాపాడుకోండి
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:32 AM
ఇటీవల అడపాదడపా కురిసిన వర్షాలతో పలువురు రైతులు అపరాలు, నువ్వు, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలు వేశారని, కానీ తరువాత అనుకున్న మేర వర్షాలు పడకపోవడంతో నేల బెట్టకుగురై పంటలు ఎండిపోతున్నాయని, ఇటువంటి తరుణంలో ఆయా పంటలను కాపాడుకునేందుకు తగు చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ కె.ముకుందరావు సూచించారు.
పైరుపై మల్టీకే ద్రావణం పిచికారీ
కలుపును నివారించి, చాళ్ల మధ్య లోతుగా దున్నుకోవాలి
ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ ముకుందరావు సూచన
అనకాపల్లి అగ్రికల్చర్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఇటీవల అడపాదడపా కురిసిన వర్షాలతో పలువురు రైతులు అపరాలు, నువ్వు, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలు వేశారని, కానీ తరువాత అనుకున్న మేర వర్షాలు పడకపోవడంతో నేల బెట్టకుగురై పంటలు ఎండిపోతున్నాయని, ఇటువంటి తరుణంలో ఆయా పంటలను కాపాడుకునేందుకు తగు చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ కె.ముకుందరావు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నీటి ఎద్దడికి గురైతే సాధ్యమైనంత వరకు నీరు పెట్టాలని, ఒకవేళ నీరు అందుబాటులో లేకపోతే ఒక లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున మల్టీకే లేదా 19:19:19 ఎరువును కలిపి, ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలని తెలిపారు. నేలలో తేమను కాపాడుకునేందుకు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. చాళ్ల పద్ధతిలో మొక్కజొన్న, నువ్వు, పత్తి పంటలు వేసినట్టయితే వరుసల మధ్య నాగలి లేదా గొర్రుతో లోతుగా దున్నుకోవాలని సూచించారు. మొక్కజొన్నలో వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరానికి 2.4 డి సోడియం లవణం 500 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. వెడల్పాకు గడ్డి జాతి, కలుపు మొక్కలు రెండూ ఉంటే వీటి నివారణకు ఎకరాకు టెంటోట్రోయన్ 115 మిల్లీలీటర్లు, అట్రాజన్ 400 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 15-18 రోజుల మధ్యలో పిచికారీ చేసుకోవాలని తెలిపారు. పూతదశ నుంచి కాయ ఏర్పడే దశలో ఉన్న అపరాల పంటలను కాయ తొలిచే పురుగు ఆశించే అవకాశం ఉందని, వీటి నివారణకు క్లోరాంత్రినిప్రోల్ మందును లీటరు నీటికి 0.3 మిల్లీమీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. చెరకులో నీటి ఎద్దడిని నివారించేందుకు లీటరు నీటికి 2.5 గ్రాముల యూరియా, 2.5 గ్రాముల ఎంవోపీ లేదా 10 గ్రాముల మల్టీకే ద్రావణాన్ని కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలని సూచించారు.