రూ.కోటితో ధారాలమ్మ ఆలయం పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:40 PM
జీకేవీధి మండలం ధారకొండ ఘాట్ రోడ్డులో కొలువైన ధారాలమ్మ ఆలయం పునర్నిర్మాణానికి కోటి రూపాయలతో ప్రతిపాదనలు చేసినట్టు దేవదాయ శాఖ ఈవో టి.సాంబశివరావు తెలిపారు.
దేవదాయ శాఖ ఈవో సాంబశివరావు
సీలేరు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారకొండ ఘాట్ రోడ్డులో కొలువైన ధారాలమ్మ ఆలయం పునర్నిర్మాణానికి కోటి రూపాయలతో ప్రతిపాదనలు చేసినట్టు దేవదాయ శాఖ ఈవో టి.సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆలయం గోపురం కారిపోవడంతో గతంలో రూ.50 లక్షలతో ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ మేరకు స్థానికులు రూ.పది లక్షలు విరాళాలను సేకరించి డిపాజిట్ చేశారన్నారు. దీంతో దేవదాయ శాఖ మిగతా రూ.40 లక్షలను విడుదల చేసిందన్నారు. అయితే ఈ నిధులు ఆలయ నిర్మాణానికి సరిపోవని స్థానికులు సూచించారన్నారు. దీంతో శుక్రవారం ఆలయం వద్ద దేవదాయ శాఖ ఏఈ గజపతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ పెద్దలు, నిపుణుల సూచన మేరకు సర్వే నిర్వహించి, కోటి రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అయితే స్థానికులు మరో రూ.పది లక్షలు డిపాజిట్ చేయాలని అధికారులు సూచించారన్నారు. వారు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే రూ.కోటి విడుదల అవుతుందని ఏవో సాంబశివరావు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఏఈ గజపతి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పోతురాజు గోవింద్ పాల్గొన్నారు.