Share News

ఆస్తి పన్ను వసూళ్లు అంతంతే!

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:46 AM

స్థానిక మునిసిపాలిటీలో ఆస్తి పన్ను, వీఎల్‌టీ వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. నివాస, వాణిజ్య భవనాల నుంచి రూ.4.73 కోట్లు వసూలు కావాల్సి వుండగా గురువారంనాటికి రూ.2.78 కోట్లు (58.77 శాతం) మాత్రమే వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈలోగా శత శాతం పన్నులు చేయడం అసాధ్యమని అంటున్నారు.

ఆస్తి పన్ను వసూళ్లు అంతంతే!
ఎలమంచిలి ఫైర్‌ ఆఫీసు కాలనీలో ఇంటి పన్నుల వసూళ్ల ప్రక్రియను పరిశీలిస్తున్న కమిషనర్‌ ప్రసాదరాజు, ఆర్వో విశ్వేశ్వరరావు

ఎలమంచిలిలో బకాయిలు రూ.4.73 కోట్లు

ఇంతవరకు వసూలైంది రూ.2.78 కోట్లు

వీఎల్‌టీ లక్ష్యం రూ.26 లక్షలు.. వచ్చింది రూ.6 లక్షలే!

ఇంకా ఐదు రోజులే గడువు

గత ఏడాదితోపోలిస్తే బాగా వెనుకబాటు

ఎలమంచిలి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక మునిసిపాలిటీలో ఆస్తి పన్ను, వీఎల్‌టీ వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. నివాస, వాణిజ్య భవనాల నుంచి రూ.4.73 కోట్లు వసూలు కావాల్సి వుండగా గురువారంనాటికి రూ.2.78 కోట్లు (58.77 శాతం) మాత్రమే వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈలోగా శత శాతం పన్నులు చేయడం అసాధ్యమని అంటున్నారు.

ఎలమంచిలి మునిసిపాలిటీలో మొత్తం 11,272 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు కాకుండా ఇతర నివాస, వాణిజ్య భవనాలకు సంబంధించి ఆస్తి పన్ను, పాత బకాయిలు కలిపి మొత్తం రూ. 4.73 కోట్లు వసూలు కావాల్సి వుంది. గురువారం నాటికి రూ.2.78 కోట్లు (58.77 శాతం) మాత్రమే వసూలయ్యాయి. వాస్తవంగా ఆస్తి పన్నును నాలుగు వాయిదాల్లో చెల్లించాలి. మొదటి వాయిదా (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) పన్నును జూన్‌ చివరిలోగా చెల్లించకపోతే జూలై ఒకటో తేదీ నుంచి 24 శాతం వడ్డీతో అపరాధ రుసుము విధిస్తారు. మిగిలిన మూడు వాయిదాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. కాగా మార్చి చివరిలోగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేవారికి అపరాధ రుసుములో 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ ఎలమంచిలి మునిసిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి.

ఇక మునిసిపాలిటీ పరిధిలో 610 ఖాళీ స్థలాలు వున్నాయి. వీటి ద్వారా రూ.26 లక్షలు (వీఎల్‌టీ) రావాల్సి వుండగా గురువారం నాటికి రూ.6 లక్షలు (23 శాతం) మాత్రమే వసూలయ్యాయి. ప్రభుత్వ భవనాలకు సంబంధించి రూ.1.45 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి వుంది. ఇందులో రూ.35 లక్షలు మండల పరిషత్‌ నుంచి రావాల్సి వుందని ఆర్వో తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు మినహాయిస్తే మిగిలిన పన్నులు ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు, ఆర్వో విశ్వేశ్వరరావు సిబ్బందితో కలిసి ర్యాండమ్‌గా కొన్ని ఇళ్లకు స్వయంగా వెళ్లి, ఆస్తి పన్ను బకాయిల గురించి వాకబు చేస్తున్నారు. ఇప్పటికే పన్ను చెల్లించివుంటే అభినందిస్తున్నారు. ఒకవేళ బకాయి వుంటే.. అపరాధ రుసుముపై 50 శాతం రాయితీ వుందని, సత్వరమే చెల్లించాలని చెబుతున్నారు. ఆస్తి పన్ను చెల్లించే వారి సౌకర్యార్థం మునిసిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి రాత్రి ఎనిమిది గంటల వరకు పన్ను డబ్బులు తీసుకుంటున్నారు. కాగా మునిసిపాలిటీలో గత ఏడాది 88 శాతం ఆస్తిపన్ను వసూలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో ఐదు రోజుల్లో ముగియనున్నది. ఈలోగా మిగిలిన సుమారు రూ.1.95 కోట్లు ఎలా వసూలు చేస్తారో అధికారులకే తెలియాలి.

Updated Date - Mar 27 , 2026 | 12:46 AM