Share News

ఆస్తుల గొడవలు, వివాహేతర సంబంధాలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:01 AM

గత నెల 11వ తేదీన ఆరిలోవ దుర్గానగర్‌లో కాపు లక్ష్మి (45) అనే గృహిణిని పదిహేనేళ్లుగా పరిచయం ఉన్న టాటూ శివ అనే వ్యక్తి మూడో కంటికి తెలియకుండా మట్టుబెట్డాడు.

ఆస్తుల గొడవలు, వివాహేతర సంబంధాలు

  • మెజారిటీ హత్యలకు ఇవే కారణం

  • గత రెండేళ్లలో 44 హత్యలు

  • అందులో పురుషులు 31 మంది, మహిళలు 13 మంది

  • హంతకుల్లో అత్యధికులు పరిచయస్తులే..

  • బహిరంగ ప్రదేశాల్లోనే...

  • కత్తుల వినియోగమే అధికం

  • రాత్రివేళల్లోనే ఘాతుకాలు

  • 61.36 శాతం కేసుల్లో ముందస్తు ప్రణాళికతోనే...

  • ఆంధ్ర మెడికల్‌ కళాశాల ఫోరెన్సిక్‌ బృందం విశ్లేషణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గత నెల 11వ తేదీన ఆరిలోవ దుర్గానగర్‌లో కాపు లక్ష్మి (45) అనే గృహిణిని పదిహేనేళ్లుగా పరిచయం ఉన్న టాటూ శివ అనే వ్యక్తి మూడో కంటికి తెలియకుండా మట్టుబెట్డాడు. డబ్బుల కోసమే ఆమెను చంపేశాడు.

రెండు రోజుల క్రితం గాజువాకలో నేవీ ఉద్యోగి రవీంద్ర (29) తన ప్రియురాలు మౌనిక (31)ను తన ఫ్లాట్‌కు తీసుకువచ్చి క్రూరంగా చంపేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టాడు. డబ్బుల కోసం తనను వేధిస్తున్నదనే కారణంతోనే చంపేశానని పేర్కొంటూ పోలీసులకు లొంగిపోయాడు.

...ఇలాంటి హత్యలు నగరంలో కొద్దికాలంగా పెరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏమిటో తెలుసుకోవడానికి ఆంధ్ర మెడికల్‌ కాలేజీ ఫోరెన్సిక్‌ విభాగంలో కొందరు ఒక బృందంగా ఏర్పడి 2023, 2024 సంవత్సరాల్లో జరిగిన హత్యల వివరాలు రికార్డుల నుంచి సేకరించి వాటిని విశ్లేషించారు. జిల్లాలో ఎక్కడ ఏ హత్య జరిగినా ఆ మృతదేహం పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కే వస్తుంది. దానిని ఫోరెన్సిక్‌ విభాగమే పరీక్షించి కారణాలు వెల్లడిస్తుంది. ఆ సమయంలో పోలీసులు వారికి లభించిన సమాచారం అంతా అందిస్తారు. అలా వచ్చిన సమాచారాన్ని, పోస్టుమార్టంలో బయటపడిన వాస్తవాలను కలిపి ఈ బృందం విశ్లేషణ చేసింది. ఆ వివరాలివి...

కింగ్‌ జార్జి ఆస్పత్రికి 2023లో 1,852, 2024లో 1,927 మృతదేహాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చాయి. అనారోగ్యంతో చనిపోయినవారు కొందరైతే, ప్రమాదాల్లో చనిపోయిన మరికొందరు. ఈ రెండేళ్లలో హత్యకు గురైనవారు 44 మంది. వారిలో పురుషులు 31 మంది కాగా, మహిళలు 13 మంది ఉన్నారు.

- హత్యకు గురైన మహిళల్లో 31.82 శాతం మంది 30-39 ఏళ్ల మధ్య వారు కావడం గమనార్హం. ఆ తరువాత స్థానంలో 20-29 ఏళ్ల మధ్య వయస్సు వారున్నారు. బాధితుల్లో అత్యధికులు గృహిణులే.

ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలు

ఈ హత్యల్లో 36.36 శాతం ఆస్తుల కోసం, కక్ష తీర్చుకోవడం కోసం జరిగినవి కావడం విశేషం. ఆ తరువాత వివాహేతర సంబంధాల కారణంగా 29.55 హత్యలు జరిగాయి. గత నెల ఫిబ్రవరిలో కాపు లక్ష్మి, రెండు రోజుల క్రితం మౌనిక కూడా వివాహేతర సంబంధాల వల్లే చనిపోవడం గమనార్హం.

కత్తులతోనే దాడులు

ప్రాణాలు హరించడానికి ఎక్కువ మంది (22.7 శాతం) కత్తులనే ఉపయోగించారు. ఆ తరువాత కర్రలు, చేతులు, ఐరన్‌ రాడ్లు, కొన్ని కేసుల్లో పెట్రోల్‌ కూడా వినియోగించారు.

అంతా ప్రణాళిక ప్రకారమే

గత రెండేళ్లలో జరిగిన హత్యల్లో 61.36 శాతం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగాయి. ఇటీవల జరిగిన హత్యలు (కాపు లక్ష్మి, మౌనిక) కూడా ఆ కోవలోకే వస్తాయి. ఇద్దరి మధ్య వాదన జరిగినప్పుడు కోపం తట్టుకోలేక ఆవేశంలో చంపేసిన కేసులు 29.55 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి.

తలపై గాయాలతోనే

హత్య కేసుల్లో ఎక్కువగా తలపై గాయాలు కావడం వల్లనే చనిపోతున్నారు. గత రెండేళ్లలో 18 మంది ఆ విధంగానే మరణించారు. హత్యాయత్నం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు వెళ్లినప్పుడు అప్పటికే దాడికి గురైనవారు చనిపోతున్నారు. 44 కేసుల్లో 20 మంది స్పాట్‌లోనే మరణించారు. దాడి జరిగిన ఒకరోజు తరువాత మరణించినవారు మరో ఐదుగురు ఉన్నారు.

మెడికల్‌ జర్నల్‌లో ప్రచురణ

సమాజంలో పెరుగుతున్న హత్యలకు కారణాలు ఏమిటో తెలుసుకోవడానికి ఆంధ్ర మెడికల్‌ కాలేజీలో ఫోరెన్సిక్‌ అండ్‌ టాక్సికాలజీ విభాగానికి చెందిన డాక్టర్లు మంచాల జీవన్‌ అనుదీప్‌ బాబు, శ్రీనివాసరెడ్డి నందికి, శ్రావణి యండవ, ఎస్‌ఎం కృష్ణసాగర్‌, అన్నె పి, కట్టంరెడ్డి అనంత రూపేశ్‌లు కలిసి రెండేళ్ల డేటాను విశ్లేషించారు. ఇవన్నీ పోస్టుమార్టం చేసిన నాటికి అందుబాటులో ఉన్న వివరాలు. వీటిని పరిశోధించి, విశ్లేషించి 2025 డిసెంబరులో నేషనల్‌ బోర్డ్‌ ఎగ్జామినేషన్‌కు సమర్పించగా, 2026 జనవరిలో ఈ విశ్లేషణను జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌లో ప్రచురించారు. ఆస్తుల కోసం కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, వివాహేతర సంబంధాలు వంటి కారణాల వల్లే ఎక్కువ హత్యలు జరిగాయని వీరి విశ్లేషణలో వెల్లడైంది. ఎక్కువ కేసుల్లో తెలిసిన వారి చేతుల్లో బాధితులు చనిపోతున్నారు. అయితే నిందితులు మద్యం తాగి, మత్తు పదార్థాలు తీసుకొని హత్యలు చేసినట్టు ఎక్కడా నమోదు కాలేదు. డబ్బు అవసరాలు, నియంత్రించుకోలేని ఆవేశం, వివాహేతర బంధాలు హత్యలకు దారితీస్తున్నాయి.

ఎక్కువ రాత్రివేళల్లోనే...

హత్యల్లో అత్యధికం చీకటిపడిన తరువాత రాత్రి సమయాల్లోనే జరుగుతున్నాయి. గత రెండేళ్లలో 18 హత్యలు రాత్రిపూట, మరో 9 సాయంత్రం వేళ, ఉదయం పూట 8, మధ్యాహ్నం వేళ 6 హత్యలు జరిగాయి. వీటిలో 65 శాతం బహిరంగ ప్రదేశాల్లోనే జరిగాయి.

తెలిసినవారి చేతిలోనే...

ఆ రెండేళ్లలో జరిగిన హత్యల్లో మూడో వంతు మంది (31.82 శాతం) బాగా తెలిసినవారు, బంధువుల చేతుల్లోనే మరణించారు.

Updated Date - Apr 01 , 2026 | 01:01 AM