ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:33 AM
అధికారులే ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను తెలుసుకుని త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం నూతనంగా ‘ఒక నెల-ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు.
అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి
ఒకే సమస్యపై పదేపదే వినతులు రాకూడదు
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
మాడుగులలో ‘ఒక నెల-ఒక నియోజకవర్గం’
సమస్యలపై 460 అర్జీలు అందించిన ప్రజలు
మాడుగుల రూరల్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): అధికారులే ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను తెలుసుకుని త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం నూతనంగా ‘ఒక నెల-ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. మాడుగులలోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో శుక్రవారం నిర్వహించిన ‘ఒక నెల -ఒక నియోజకవర్గం’ మొదటి సమావేశానికి కలెక్టర్‌త్‌పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజల నుంచి శాఖల వారీగా అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, ఇక్కడ స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఒక సమస్యపై వచ్చిన అర్జీ మరోసారి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.
నాలుగు మండలాలు.. 460 అర్జీలు
‘ఒక నెల -ఒక నియోజకవర్గం’ కార్యక్రమానికి మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, కె.కోటపాడు మండలాల నుంచి ప్రజలు తరలివచ్చారు. అర్జీదారుల పేరు, గ్రామం, సమస్య, ఇతర వివరాలను రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు మండలాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ నమోదు తరువాత అర్జీలను కలెక్టర్, జేసీ, ఇతర అధికారులకు అందజేశారు. పలువురి సమస్యలను కలెక్టర్ స్వయంగా ఆలకించారు. ఆర్జీలను పరిశీలించిన ఆమె సంబంధిత శాఖ అధికారులను పిలిచి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఉదయం పది గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు మొత్తం 460 అర్జీలు అందాయి. మాడుగుల డంపింగ్ యార్డును వేరేచోటుకి మార్చాలని, ఆర్టీసీ కాంప్లెక్స్‌ను వినియోగంలోకి తీసుకురావాలని పలువురు స్థానికులు అర్జీలు అందించారు. అనకాపల్లి-కింతలి బస్సును సత్యవరం మీదుగా నడపాలని, జమ్మాదేవిపేట ఎస్సీ కాలనీలో మంచినీటిపథకం ఏర్పాటు చేయాలని, కింతలి, కవ్వుగుంట రోడ్డు నిర్మించాలని అర్జీలు అందించారు. మాడుగుల మండలం నుంచి 342, చీడికాడ మండలం నుంచి 80, దేవరాపల్లి మండలం నుంచి 30, కె.కోటపాడు మండలం నుంచి ఎనిమిది అర్జీలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో రెవెన్యూ పరమైనవి 190, ఇతర శాఖలకు సంబంధించినవి 270 అర్జీలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌వో శ్రీనివాసరావు, ఆర్డీవోలు ఆయీషా, వీవీ రమణ, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ అనిత, డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, వ్యవసాయ శాఖ జేడీ రవీంధ్రనాథ్, డిప్యుటీ డీఈవో అప్పారావు, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, మాడుగుల తహశీల్దారు రమాదేవి, ఎంపీడీవో అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.