Share News

పీజీఆర్‌ఎస్‌ వినతులపై సత్వర చర్యలు

ABN , Publish Date - Jul 24 , 2026 | 11:17 PM

పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు సమర్పించే వినతులపై సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

పీజీఆర్‌ఎస్‌ వినతులపై సత్వర చర్యలు
ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ నిషాంతి, పక్కన జేసీ శ్రీపూజ, తదితరులు

అధికారులకు కలెక్టర్‌ నిషాంతి ఆదేశం

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 79 వినతులు స్వీకరణ

పాడేరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు సమర్పించే వినతులపై సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం)లో ఆమెఅధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు జిల్లా స్థాయి అధికారులు సమగ్ర సమాచారంతో విధిగా హాజరుకావాలని, ప్రతి సోమవారం మండల స్థాయి అఽధికారులు తమ మండలాల్లో పీజీఆర్‌ఎస్‌ను పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రతి బుధవారం జిల్లాలో ఏదో మండలంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు సైతం జిల్లా స్థాయి అధికారులంతా విధిగా హాజరుకావాలని, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు. మీకోసంలో సమర్పించిన అర్జీలపై తాజా స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 నంబర్‌ కాల్‌ సెంటర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ నిషాంతి సూచించారు. అర్జీదారులు సదరు కాల్‌సెంటర్‌ సేవలను సద్వినియోగం చేసుకుని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి, జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, తదితరులు గిరిజనుల నుంచి 79 వినతులను స్వీకరించారు. వాటిలో రెవెన్యూ సంబంధ సమస్యలపై 39, వైద్యం 6, డీఆర్‌డీఏ 4, డ్వామా 4, తాగునీరు 4, ఇంజనీరింగ్‌ విభాగాలు, విద్యుత్‌, ఖజానా, పౌర సరఫరాలకు సంబంధించి మొత్తం 79 అర్జీలు అందాయి. కార్యక్రమంలో డీఆర్‌వో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, ఆర్డీవో ఎం.భుజంగరావు, డ్వామా పీడీ విద్యాసాగరరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, హౌసింగ్‌ పీడీ బి.బాబు, డీపీవో చంద్రశేఖర్‌, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, పీఆర్‌ ఈఈ టి.కొండయ్యపడాల్‌ , ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్‌, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ అసిస్టెంట్‌ నోడల్‌ అధికారి వి.ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 11:17 PM