Share News

మన్యంలో వలిసెల సాగుకు ప్రోత్సాహం

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:09 PM

మన్యం ప్రకృతి అందాలకు వన్నె తెచ్చిన వలిసెల సాగును కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఈ ఏడాది రబీలో జిల్లాలో 2,500 ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు వ్యాల్యూ క్లస్టర్‌ చైన్‌(వీసీసీ) పథకం ద్వారా శతశాతం రాయితీపై విత్తనాలు పంపిణీ చేయనుంది. మేలిజాతి వంగడాలను ఒడిశా సునాబెడ నుంచి తీసుకొస్తున్నది. నెలాఖరు నాటికి రైతులకు విత్తనాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది.

మన్యంలో వలిసెల సాగుకు ప్రోత్సాహం
వలిసెల పంట (ఫైల్‌)

జిల్లాలో 2,500 ఎకరాల్లో సాగుకు ప్రణాళిక

శతశాతం రాయితీపై విత్తనాలు పంపిణీ

సునాబెడ నుంచి మేలిజాతి వంగడాలు దిగుమతి

జిల్లా వ్యవసాయ శాఖ కార్యాచరణ

చింతపల్లి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వలిసెల పంట పండుతోంది. ఈప్రాంత వాతావరణం సహకరించడంతో 50 ఏళ్లుగా ఆదివాసీలు సాగు చేస్తున్నారు. వలిసెల నూనెకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ వుంది. ఈ నూనెను కాస్మొటిక్స్‌, ఔషధాలు, వంటకాలలోనూ ఉపయోగిస్తారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 12ఏళ్ల క్రితం వరకు 8,500 హెక్టార్లలో వలిసెల పంటను రైతులు సాగు చేసేవారు. కాలక్రమంగా ఆకాశపందిరి కలుపు, దిగుబడులు తగ్గడంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. గిరిజన ప్రాంతంలో ప్రస్తుతం సాధారణ సాగు విస్తీర్ణం 2,383హెక్టార్లుకాగా గత ఏడాది కేవలం 1,437 హెక్టార్లలో మాత్రమే గిరిజనులు ఈపంటను సాగు చేశారు.

వలిసెలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు

ఆదివాసీ రైతులకు మేలిజాతి వలిసెల వంగడాలను అందించేందుకు 2018లో ప్రభుత్వం ఆల్‌ ఇండియా కోఆర్డినేటెడ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టు(ఏఐసీఆర్‌పీ)ను చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి మంజూరు చేసింది. ఈ పథకంలో భాగంగా మధ్యప్రదేశ్‌ జబదల్‌పూర్‌ నుంచి మేలిజాతి వలిసెల వంగడాలను దిగుమతి చేసుకుని ఏడేళ్లగా విత్తనాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఐదు రకాల వంగడాలను క్రాసింగ్‌ చేసి వంగడాలను అభివృద్ధి చేశారు. ఐదు వంగడాలపై వివిధ దశల్లో పరిశోధనలు నిర్వహించారు. 2024లో సీపీఎల్‌(చింతపల్లి)-1, 2 రకాలు మేలిజాతి వంగడాలుగా ఎంపిక చేశారు. తుది పరిశోధన ఫలితాలు ఆధారంగా సీటీపీ-1 రకం వంగడాన్ని ఎంపిక చేశారు. ఈ సీటీపీ-1 వంగడం హెక్టారుకి 3.5 నుంచి 4.5క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. తెగుళ్లు, ఆకాశపందిరి కలుపును తట్టుకుంటుంది. పంట కాలం 105-110రోజులు ఈవిత్తనాన్ని రెండేళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

అంతరించిపోతున్న పంటకు పునరుజ్జీవం

గిరిజన ప్రాంతంలో అంతరించిపోతున్న వలిసెల పంటకు పునరుజ్జీవం ఇచ్చేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో ప్రతి ఏడాది రెండు వేల ఎకరాల్లో రైతులు వలిసెల సాగు చేసుకుంటున్నారు. దీంతోపాటు అదనంగా 2,500 ఎకరాల్లో వలిసెలను సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఆకాశపంది కలుపును తట్టుకునే మేలిజాతి వంగడాలను ఒడిశా సునాబెడ నుంచి తీసుకువస్తున్నది. రైతులకు వంద శాతం రాయితీపై ఈ విత్తనాలను అందించనుంది. ఎకరానికి రెండు కిలోలు చొప్పున ఐదు ఎకరాల వరకు రైతులకు విత్తనం అందజేయనుంది. అరకులోయ డివిజన్‌లో వెయ్యి, పాడేరులో వెయ్యి, చింతపల్లిలో ఐదు వందల ఎకరాల్లో సాగు చేయించేందుకు రైతులను వ్యవసాయ శాఖ ఎంపిక చేసింది.

పర్యాటకానికి ప్రోత్సాహం

అల్లూరి జిల్లా పేరు చెప్పగానే పచ్చని అడవులు, జలపాతాలు, మంచు అందాలతోపాటూ పసుపు పచ్చని పూలు(వలిసెలు) సందర్శకులకు గుర్తుకొస్తాయి. గిరిజన ప్రాంతంలో వలిసెల పంట ప్రకృతి అందాలకు వన్నె తెస్తుంది. వలిసెల పంటను రబీకాలంలో రైతులు సాగుచేస్తారు. అదే సమయంలో పర్యాటక సీజన్‌ ప్రారంభమవుతుంది. దీంతో వలిసెల అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి పర్యాటకులు గిరిజన ప్రాంతానికి వస్తున్నారు. వలిసెల పంట వద్ద ఫొటోలు తీసుకుని ఎంజాయ్‌ చేస్తుంటారు. దీంతో సందర్శక ప్రాంతాల రైతులకు అధిక మొత్తంలో విత్తనాలను అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు.

వచ్చే నెల మొదటి వారంలో విత్తనాలు పంపిణీ

బీవీ తిరుమలరావు, ఏడీఏ, చింతపల్లి

గిరిజన రైతులకు వచ్చే నెల మొదటి వారంలో విత్తనాలు పంపిణీ చేస్తాం. నెలాఖరు నాటికి రైతు సేవా కేంద్రాలకు వలిసెల విత్తనాలు అందుబాటులోకి వస్తాయి. శతశాతం రాయితీపై విత్తనాలను డీ కృషి యాప్‌ ద్వారా పారదర్శకంగా రైతులకు అందజేస్తాం. నాట్లు వేసిన నాటి నుంచి పంట కోసే వరకు వ్యవసాయ శాఖ సాంకేతిక సహకారం అందిస్తుంది.

Updated Date - Aug 22 , 2026 | 11:09 PM