ఆశాజనకంగా లిచీ దిగుబడులు
ABN , Publish Date - Jun 14 , 2026 | 10:50 PM
స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం(హెచ్‌ఆర్‌ఎస్)లో శాస్త్రవేత్తలు మూడు రకాల లిచీ మొక్కలపై పరిశోధనలు చేయగా, రెండు రకాలు మేలైనవని నిర్ధారణ అయింది.
హెచ్‌ఆర్‌ఎస్‌లో పరిశోధనలు విజయవంతం
ఈ ఏడాది పండ్ల నాణ్యత భేష్
శాహి, బడాన రకాలు గిరిజన ప్రాంతానికి అనుకూలమని శాస్త్రవేత్తల నిర్ధారణ
ఇవే రైతులకు సిఫారసు
సాగు విస్తీర్ణం పెంచేందుకు కార్యాచరణ
చింతపల్లి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం(హెచ్‌ఆర్‌ఎస్)లో శాస్త్రవేత్తలు మూడు రకాల లిచీ మొక్కలపై పరిశోధనలు చేయగా, రెండు రకాలు మేలైనవని నిర్ధారణ అయింది. ఈ రెండు రకాల పండ్ల పరిమాణం, నాణ్యత, దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో పాటు చీడపీడలను తట్టుకునే తత్వం ఉన్నాయని గుర్తించారు. ఈ ఏడాది నాణ్యమైన దిగుబడులు వచ్చాయి. దీంతో గిరిజన ప్రాంతంలో సాగును విస్తరింపజేసేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
గిరిజన ప్రాంత నేలలు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా శాహి, బడాన రకం లిచీ మొక్కలు అత్యంత అనుకూలమని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఉద్యాన పరిశోధన స్థానంలో శాహి, బడాన, చైన రకాల లిచీ మొక్కలపై పరిశోధనలు చేశారు. ఈ మూడు రకాల మొక్కల ఎదుగుదల, పండ్ల దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ శాహి, బడాన మేలిజాతి రకాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. పండ్ల పరిమాణం, నాణ్యత, దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో పాటు చీడపీడలను తట్టుకునే తత్వం శాహి, బడానలో పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఈ రెండు రకాల మొక్కలను రైతులకు సిఫారసు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ మొదటి వారం నుంచి లిచీ దిగుబడులు ప్రారంభమయ్యాయి. కిలో పండ్లు రూ.200 ధరకు ప్రాంతీయ మార్కెట్‌లో ఉద్యాన శాస్త్రవేత్తలు విక్రయిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి కొంత తగ్గిందని, లిచీ మొక్కలు ఒక ఏడాది అత్యధిక దిగుబడులు ఇస్తే, రెండో ఏడాది దిగుబడులు తగ్గే తత్వం వుంటుందని హెచ్‌ఆర్‌ఎస్ సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ వి.రమణ తెలిపారు. గిరిజన ప్రాంతంలో లిచీ మొక్కలను కొంత మంది రైతులు సాగు చేస్తున్నారు. జీకేవీధి మండలం మాడెం, దామనాపల్లి, మంగళపాలెం గ్రామాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం పెంచేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. లిచీ పంట ద్వారా గిరిజన రైతులకు మంచి ఆదాయం సమకూరుతుంది. వచ్చే ఏడాది అంటు కట్టిన మొక్కలను అభివృద్ధి చేసి రైతులకు నామమాత్రపు ధరకు అందజేస్తామని సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు.
ఫలించిన లిచీ ప్రయోగాత్మక సాగు
గిరిజన ప్రాంత రైతులకు లిచీ పంటను పరిచయం చేయాలనే ఉద్దేశంతో నాటి టీడీపీ ప్రభుత్వ సహకారంతో వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు ముందడుగువేశారు. 2016లో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. శాస్త్రవేత్తలు బిహార్ ముజాఫ్ఫర్పూర్ జాతీయ పరిశోధన కేంద్రం(ఎన్‌ఆర్‌సీ) నుంచి శాహి, బడాన, చైన రకాల లిచీ మొక్కలను దిగుమతి చేసుకుని ఉద్యాన పరిశోధన స్థానంలో నాట్లు వేశారు. నాటి నుంచి పదేళ్లపాటు వివిధ దశల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. ఈ సాగు మంచి ఫలితాలనిచ్చింది. 2016 నుంచి 2022 వరకు మొక్కల ఎదుగుదల, మొక్కలను ఆశించే చీడపీడలపై పరిశోధనలు జరిపారు. ప్రారంభం నుంచి మొక్కల ఎదుగుదల ఆశాజనకంగా వున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రయోగాత్మక సాగులో మొక్కలకు పెద్దగా చీడపీడలు ఆశించలేదు. 2023లో తొలిసారిగా లిచీ మొక్కల నుంచి దిగుబడులు ప్రారంభమయ్యాయి. 2024 వరకు ఓ మాదిరిగా దిగుబడులు వచ్చాయి. 2025 దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఒక్కొక్క మొక్క నుంచి 35 కిలోల దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది దిగుబడులు కాస్త తగ్గినప్పటికి నాణ్యత బాగుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పండ్లు తీపి, పులుపు రుచుల్లో ఉన్నప్పటికి తీపిశాతం అధికంగా ఉంది.