Share News

ఆశాజనకంగా ఇంటర్‌ ఫలితాలు

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:28 AM

ఈ ఏడాది జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో ఇంటర్‌ ఉత్తీర్ణత 86 శాతంగా నమోదై రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది.

ఆశాజనకంగా ఇంటర్‌ ఫలితాలు
అనంతగిరి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం

ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 86 శాతం ఉత్తీర్ణత

రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో జిల్లా

సత్తా చాటిన కేజీబీవీలు, గిరిజన సంక్షేమ గురుకులాలు

పాడేరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో ఇంటర్‌ ఉత్తీర్ణత 86 శాతంగా నమోదై రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 5,653 మంది విద్యార్థులకు గాను 4,368 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 77 శాతంగా, ద్వితీయ సంవత్సరంలో 5,370 మంది విద్యార్థులకు గాను 4,603 మంది ఉత్తీర్ణులై 86 శాతం నమోదైంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఇంటర్‌ రెండు సంవత్సరాల ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మెరుగుపడిన ఇంటర్‌ విద్య

ఏజెన్సీలో ఇంటర్‌ విద్య చాలా వరకు మెరుగుపడిందనే చెప్పాలి. గతంలో శాశ్వత ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు లేకపోవడంతో పాటు సరైన పర్యవేక్షణ ఉండేది కాదు. దీంతో గత ఏడాది, అంతకు ముందు సైతం ఆశించిన స్థాయిలో ఇంటర్‌ ఫలితాలు సాధించలేకపోయారు. కానీ ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, గిరిజన సంక్షేమ గురుకులాలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో సైతం చక్కని ఫలితాలు సాధించారు. ప్రధానంగా వంద రోజుల ప్రణాళిక, డైలీ టెస్ట్‌ల కారణంగా విద్యార్థుల్లో బోధన, అభ్యాసన మరింత మెరుగుపడడం వల్లే చక్కని ఫలితాలు సాధించామని సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు అభిప్రాయపడ్డారు.

సత్తా చాటిన కేజీబీవీలు, గురుకులాలు

జిల్లాలో ఇంటర్‌ ఫలితాల్లో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల, గిరిజన సంక్షేమశాఖ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. తొలి ఏడాది ఫలితాల్లో జిల్లాలోని అనంతగిరి, జి.మాడుగుల, హుకుంపేట, ముంచంగిపుట్టు కేజీబీవీల్లో శాత శాతం ఉత్తీర్ణత సాధించగా, మిగిలిన కేజీబీవీల్లో 77 శాతం నుంచి 95 శాతంఉత్తీర్ణత సాధించాయి. అలాగే ద్వితీయ సంవత్సరంలో అనంతగిరి, డుంబ్రిగుడ, జి.మాడుగుల, హుకుంపేట, ముంచంగిపుట్టు, పాడేరు కేజీబీవీలు శత శాతం ఉత్తీర్ణత సాధించగా, మిలిగిన వాటిల్లో సైతం 97, 98 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల్లోనూ చక్కని ఫలితాలు వచ్చాయి. తొలి ఏడాదిలో జి.మాడుగుల, పాడేరు గురుకులాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించగా, మిగిలిన గురుకులాల్లో 85 నుంచి 98 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో అరకులోయ, జీవీకేధి గురుకులాల్లో శత శాతం, మిగిలిన గురుకులాల్లో 96 నుంచి 98 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కంటే గిరిజన సంక్షేమ శాఖ గురుకులాలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో చక్కని ఫలితాలు సాధించడంపై అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో యాజమాన్యాల వారీగా ఇంటర్‌ ఫలితాలు

వ.సం యాజమాన్యం పేరు తొలి ఏడాది ఉత్తీర్ణత రెండో ఏడాది ఉత్తీర్ణత శాతం

1. ప్రభుత్వ కాలేజీలు 69.37 80.07

2. టీడబ్ల్యూ గురుకులాలు 95.96 98.23

3. కేజీబీవీలు 94.43 98.79

4. ప్రైవేటు కాలేజీలు 56.17 76.53

Updated Date - Apr 16 , 2026 | 01:28 AM