ప్రాజెక్టు సారథి
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:09 AM
నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నింటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానంలోకి తీసుకువచ్చే ‘ప్రాజెక్టు సారథి’తో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అభిప్రాయపడ్డారు.
నగరంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అధికారుల ప్రతిపాదన
కూడళ్లలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి గుర్తింపు
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తో కలిసి సీపీ శంఖబ్రతబాగ్చి క్షేత్రస్థాయి పరిశీలన
విశాఖపట్నం, జూలై 8 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నింటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానంలోకి తీసుకువచ్చే ‘ప్రాజెక్టు సారథి’తో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అభిప్రాయపడ్డారు. నగరంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణతోపాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సీపీ విజ్ఞప్తి మేరకు జీవీఎంసీ ఆధ్వర్యంలో ‘ప్రాజెక్టు సారథి’ని అమలు చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ విధానంలో నగరంలో ఇప్పుడున్న అన్ని కూడళ్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సీసీ కెమెరాలను తొలగించి ఏఐ ఆధారిత అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ఆ హై రిజల్యూషన్ కెమెరాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలతోపాటు మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా రాకపోకలు సాగించే వాహనాలను ఫొటోలు తీసి కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు పంపుతాయి. ఆ తరువాత వాహనచోదకులకు ఈ-చలాన్ జారీ అవుతాయి. అలాగే పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగే నేరస్థులు రోడ్డుపైకి వస్తే వారి ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా వివరాలను గుర్తించి పోలీసులకు చేరవేస్తాయి. చిన్నపాటి ఉల్లంఘనకు పాల్పడినా జరిమానా పడిపోతుంది కాబట్టి విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తారని, దాంతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయన్నది అధికారుల ఉద్దేశం. ఈ పథకాన్ని త్వరలో అమలు చేయబోతున్నందున ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించేందుకు సీపీ శంఖబ్రతబాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ బుధవారం మద్దిలపాలెం కూడలిలోని ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ వద్దకు వెళ్లారు. అక్కడ నిలబడి పరిస్థితులను పరిశీలించారు. సీసీ కెమెరాలను ఎక్కడ ఏర్పాటుచేయాలి, ఎన్ని కెమెరాలు అవసరం అవుతాయనే అంశంపై చర్చించుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు వెళ్లి అక్కడ నుంచి నగరంలోని వివిధ కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ, వాహనాల రాకపోకల తీరుతెన్నులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే ట్రాఫిక్ నిర్వహణ మరింత స్మార్ట్‌గా తయారవడంతోపాటు రోడ్లు కూడా సురక్షితమైనవిగా గుర్తింపుపొందుతాయని సీపీ ఆశాభావం వ్యక్తంచేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ పీవీవీ సత్యనారాయణరాజును జీవీఎంసీ కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఇంజనీరింగ్, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.