Share News

ప్రాజెక్టు సారథి

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:18 AM

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు అమలుచేయనున్న ‘ప్రాజెక్టు సారథి’ని నెల రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ జీవీఎంసీ, పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టు సారథి

  • నగరంలో ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌

  • 101 కూడళ్లలో అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కెమెరాలు

  • జీవీఎంసీ ప్రత్యేక కార్యక్రమం

  • సిగ్నల్‌ జంప్‌ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ-చలాన్‌ జారీ

  • అదేవిధంగా ట్రాఫిక్‌కు అనుగుణంగా సిగ్నల్స్‌ సింక్రనైజేషన్‌

  • జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు అమలుచేయనున్న ‘ప్రాజెక్టు సారథి’ని నెల రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ జీవీఎంసీ, పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ‘ప్రాజెక్టు సారథి’ అమలుపై జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ఇంజనీరింగ్‌ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులతో జీవీఎంసీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులకు సవివరంగా కమిషనర్‌ వివరించారు. నగరంలో ట్రాఫిక్‌ పెరగడం వల్ల ప్రజా జీవనానికి ఇబ్బంది కలగడంతోపాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు మెరుగైన జీవన వసతులను కల్పించడంలో భాగంగా జీవీఎంసీ ఆధ్వర్యంలో సిస్టమేటిక్‌ అగ్మింటెడ్‌ రేడియల్‌ ట్రాఫిక్‌ అండ్‌ హూప్‌ ఇండక్షన్‌ (ఎస్‌ఏఆర్‌టీహెచ్‌ఐ) అమలు చేసేందుకు ‘ప్రాజెక్టు సారథి’కి రూపకల్పన చేశామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరంలో 90 కూడళ్లలో ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌), 101 జంక్షన్‌లలో అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తామన్నారు. వీటిని జీవీఎంసీ కార్యాలయంలో ఉన్న సిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ (కమాండ్‌ కంట్రోల్‌సెంటర్‌)కు అనుసంధానం చేస్తామన్నారు. ఈ సిస్టమ్‌లో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వయలేషన్‌ డిటెక్షన్‌ చేసి ఆటోమేటిక్‌గా జరిమానా విధిస్తూ వాహన యజమానికి ఈ-చలాన్‌ జారీ అవుతుందన్నారు. అలాగే నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల రాకపోకలు సజావుగా సాగిపోయేలా ఏటీసీఎస్‌ ద్వారా ట్రాఫిక్‌ సిగ్నల్‌ సింక్రనైజేషన్‌ చేయడం జరుగుతుందన్నారు. వాహనాల రద్దీకి అనుగుణంగా గ్రీన్‌సిగ్నల్‌ ఆటోమేటిక్‌గా ఇండికేట్‌ అవుతుందన్నారు. ప్రముఖుల రాకపోకల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా గ్రీన్‌సిగ్నల్‌ వచ్చేలా సిటీ ఆపరేషన్‌ సెంటర్‌ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. దీనివల్ల ప్రజలకు ట్రాఫిక్‌ సమస్య తొలగడంతోపాటు రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్టపడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించామన్నారు. టెండర్లలో మూడు ఏజెన్సీలు పాల్గొన్నాయని, అవన్నీ ఫైనాన్స్‌ బిడ్‌కు అర్హత సాధించాయన్నారు. ఆయా ఏజెన్సీలతో ఇప్పటికే నగరంలో మూడు కూడళ్లలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా నెల రోజులుపాటు ఆయా విధానాలను అమలు చేసి ఉత్తమ ఫలితాలు వచ్చినట్టు నిర్ధారించామన్నారు. ప్రాజెక్టును వీలైనంత వేగంగా పట్టాలెక్కించేందుకు టెండర్‌లో తదుపరి దశకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.వర్మ, చీఫ్‌ ఇంజనీర్‌ పీవీవీ సత్యనారాయణరాజు, వీఎంఆర్‌డీఏ చీఫ్‌ ఇంజనీర్‌ వినయ్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 01:18 AM