అన్ని శాఖల్లో పురోగతి సాధించాలి
ABN , Publish Date - Jan 12 , 2026 | 10:49 PM
జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని మరింతగా పెంచాలని, అన్ని శాఖల్లో పురోగతి సాధించాలని జిల్లా అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు.
జిల్లా అధికారులకు సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశం
పాడేరు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని మరింతగా పెంచాలని, అన్ని శాఖల్లో పురోగతి సాధించాలని జిల్లా అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. వివిధ రంగాలు, సర్వీస్ సెక్టార్లలో జిల్లాలోని ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు సేకరించిన ప్రభుత్వం, జిల్లాలో కేవలం 62 శాతం మాత్రమే ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గుర్తించింది. ఈ క్రమంలో దానిని మరింతగా పెంచాలని సీఎం సూచించారు. అలాగే ప్రజలకు పథకాలు అందుతున్న తీరు, వాటిపై ప్రజల అభిప్రాయాలను పక్కాగా సేకరించాలన్నారు. అవినీతి, పథకాల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ పథకాల అమలు తీరుపై స్పందన స్వీకరిస్తున్నామని, అయితే ఐవీఆర్‌ఎస్‌లో ప్రజల అభిప్రాయాలు తెలిపే క్రమంలో గిరిజనులకు అవగాహన లేకపోవడం సమస్యగా ఉందన్నారు. అందువలన ఐవీఆర్‌ఎస్‌లో విభిన్నమైన స్పందన నమోదవుతుందని, వివిధ శాఖల పురోగతికి చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, ఇతర పథకాల అమలు, అవినీతి రహితం, పౌర సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చూస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్‌వో పి.అంబేడ్కర్, ఆర్‌డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావు, జిల్లా ఉద్యావనాధికారి కె.బాలకర్ణ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, డ్వామా పీడీ విద్యాసాగరరావు, సీపీవో ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.