Share News

కొత్త అంశాలపై నైపుణ్యం అవశ్యం

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:57 AM

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది.

కొత్త అంశాలపై నైపుణ్యం అవశ్యం

గిరిజన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

గిరిజనుల్లో అక్షరాస్యత పెరగాలి: గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

ఈ ప్రాంత యువత అల్లూరి వారసులు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

ప్రజల సమస్యలకు పరిష్కారాలు కూడా కనుగొనాలి: రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌

విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. విశాఖపట్నంలోని నోవాటెల్‌ హోటల్‌ దీనికి వేదికగా నిలిచింది. భారతదేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా రాగా, విద్యార్థులు గిరిజన సంప్రదాయ శైలిలో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, వేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త అంశాలపై నైపుణ్యం సాధించాలని సూచించారు. అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ గిరిజనుల అక్షరాస్యత శాతం పెరగాల్సి ఉందన్నారు. కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ, ఈ ప్రాంత యువత బ్రిటీష్‌ వారితో పోరాడిన అల్లూరి సీతారామరాజు వారసులుగా అభివర్ణించారు. కుటుంబంపైనే కాకుండా సమాజం, దేశం పట్ల కూడా బాధ్యతతో వ్యవహరించాలని యువతకు సూచించారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ, డిగ్రీ పట్టాలను సాధించడమే కాకుండా ప్రజల సమస్యలకు పరిష్కారాలు కూడా కనుగొనాలని సూచించారు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే విధంగా విద్యార్థులు పరిశోధనలు చేయాలన్నారు.

గిరిజన సాధికారతే లక్ష్యం

గిరిజన సాధికారతే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం లక్ష్యమని వైస్‌ ఛాన్సరల్‌ టి.శ్రీనివాసన్‌ వెల్లడించారు. ప్రథమ స్నాతకోత్సవంలో విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ టి.శ్రీనివాసన్‌ కీలక ప్రసంగం చేశారు. పట్టాలు అందుకున్నవారికి అభినందనలు తెలిపారు. ఇది విద్యకు ముగింపు కాదని, సమాజం పట్ల బాధ్యతకు పునాది అని గుర్తుచేశారు. దేశాభివృద్ధిలో గిరిజనులను సమాన భాగస్వాములుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, దానికి విద్యార్థులు కూడా సహకరించాలన్నారు. గత నాలుగేళ్ల నుంచి ప్రత్యేకంగా గిరిజన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గిరిజనుల అభివృద్ధికి కొండకారకం, ఎస్‌.బూర్జవలస గ్రామాలను దత్తత తీసుకున్నామన్నారు. పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నామని, కీలక రంగాల్లో రూ.65 కోట్ల విలువైన పరిశోధన పత్రాలు సమర్పించామన్నారు. సెమీ కండక్టర్లకు ఉపయోగించే పదార్థాలు, సెన్సార్లపై పరిశోధనలు నిర్వహిస్తున్నామన్నారు. ఐసీఎంఆర్‌ సహకారంతో సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధి నివారణకు కృషి చేస్తున్నామన్నారు. పతంజలి రీసెర్చి ఫౌండేషన్‌తో కలిసి దేశీయ వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మరో ప్రముఖ సంస్థతో కలిసి చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. గిరిజన జ్ఞానం, ఆధునిక విజ్ఞానం మేళవించి సుస్థిర పరిష్కారాలు చూపడం ద్వారా వికసిత్‌ భారత్‌ లక్ష్యాలను సాధించడంలో ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రముఖ కేంద్రంగా నిలపాలని కృషిచేస్తున్నామన్నారు. పట్టాలు పుచ్చుకున్నవారంతా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ విశ్వవిద్యాలయం రాయాబారులేననే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిత్యం నేర్చుకుంటూనే ఉండాలని ఉద్బోధించారు. యువత జ్ఞానం మానవాళి సేవకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ ఉత్సవంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, నారా లోకేశ్‌, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.


ఫీజులు తక్కువ...నాణ్యత ఎక్కువ

ఫ్యాకల్టీ సొంత బిడ్డల్లా చూసుకున్నారు

గిరిజన విశ్వవిద్యాలయం బంగారు పతకాల విజేతల అభిప్రాయాలు

విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల కంటే తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నదని అక్కడ చదువుకొని బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు పేర్కొన్నారు. నోవాటెల్‌ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన ప్రథమ స్నాతకోత్సవంలో 13 మంది ప్రతిభావంతులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బంగారు పతకాలు, పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా వారిలో కొందరిని ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించినప్పుడు ఫీజులు తక్కువని, ఫ్యాకల్టీ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారని, అక్కడ చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటామని చెప్పుకొచ్చారు.

రెండేళ్ల పీజీకి రూ.7 వేలే ఫీజు

ఫైజల్‌ బాబు సీకే, మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, కేరళ

మాది కేరళ. డిగ్రీ పూర్తయ్యాక సోషల్‌ వర్క్‌లో పీజీ చేయాలని అనేక యూనివర్సిటీలు తిరిగాను. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఫీజు ఏడాదికి కేవలం రూ.3,500 అని తెలుసుకుని ఆశ్చర్యపోయా. ఫ్యాకల్టీని కలిశా. బాగుందని ఇక్కడే చేరా. రెండేళ్లకు రూ.7 వేలు మాత్రమే కట్టా. గోల్డ్‌మెడల్‌ సాధించా. ఇక్కడే పీహెచ్‌డీ కూడా చేస్తున్నా. చాలా బాగుంది.

కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా

కాకినాడ లావణ్య, ఎంఎస్‌సీ (కెమిస్ట్రీ)

మా నాన్న కార్పెంటర్‌. అమ్మ గృహిణి. ఈ యూనివర్సిటీలో ఎంఎస్‌సీ కెమిస్ట్రీ చదివాను. 8.5 మార్కులతో బంగారు పతకం సాధించా. ఫ్యాకల్టీ చాలా బాగుంది. కుటుంబంలా చూసుకున్నారు. ఇప్పుడు నేను ఓ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చే విద్యార్థులకు కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. లక్ష్యం స్పష్టంగా ఉంటుంది.

డీఆర్‌డీఓలో రీసెర్చ్‌ అవకాశం వచ్చింది

లావణ్య, ఎంఎస్‌సీ (బయో టెక్నాలజీ) టాపర్‌

మా నాన్న రఘుశంకర్‌ విజయనగరంలో లైన్‌మన్‌. నేను హైదరాబాద్‌ యూనివర్సిటీలో పీజీ చేస్తానని చెప్పాను. కానీ నాన్న ఈ గిరిజన యూనివర్సిటీలోనే చదవాలని, చాలా బాగుంటుందని బలవంతంగా చేర్పించారు. అక్కడ చేరిన తరువాత తక్కువ అంచనా వేశానని బాధపడ్డా. మా హెచ్‌ఓడీ శ్రీదేవి మేడమ్‌ ఎంతో బాగా చూసుకున్నారు. నాకు ఆంధ్ర యూనివర్సిటీలో డీఆర్‌డీఓలో రీసెర్చ్‌ చేసే అవకాశం వచ్చింది.

రిలయన్స్‌లో జాబ్‌ వచ్చేసింది

విజయలక్ష్మి, ఎంబీఏ (హెచ్‌ఆర్‌)

నేను ఎంబీఏ చేశాను. బాబాయ్‌ ఈ యూనివర్సిటీ బాగుంటుందని చెబితే చేరాను. విద్యా విధానం బాగుంది. ఫ్యాకల్టీ అన్నీ అర్థమయ్యేలా చెబుతున్నారు. వాతావరణం కూడా బాగుంటుంది. నేను 2024-26 బ్యాచ్‌. యూనివర్సిటీ నుంచి రాగానే రిలయన్స్‌ స్టోర్‌లో మేనేజర్‌ ఉద్యోగం వచ్చింది. ఏడాదికి రూ.3.5 లక్షల ప్యాకేజీ.

Updated Date - Jul 01 , 2026 | 12:57 AM