ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ శశి
ABN , Publish Date - Jan 25 , 2026 | 01:12 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎం.శశి నియమితులయ్యారు.
తొలి మహిళా ప్రిన్సిపాల్‌గా గుర్తింపు
విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎం.శశి నియమితులయ్యారు. ఈ మేరకు ఏయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ శనివారం తన కార్యాలయంలో నియామక ఉత్తర్వులను అందజేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కె.రాంబాబు, డీన్లు కె.రాజేంద్రప్రసాద్, కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆమె ప్రిన్సిపాల్‌గా బాధ్యతలను చేపట్టారు. ఆమెను ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది అభినందించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల తొలి మహిళా ప్రిన్సిపాల్‌గా ఎం.శశి నిలిచారు.
సీనియారిటీ జాబితాను పక్కనపెట్టి..
సీనియారిటీ జాబితాలో ముందున్న వారిని పక్కనపెట్టి ప్రొఫెసర్ శశిని ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించిన సీనియారిటీ జాబితాలో ఉన్న ప్రొఫెసర్లకు పదోన్నతులు, కీలక పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ప్రొఫెసర్ శశికి అవకాశం కల్పించినట్టు పలువురు పేర్కొంటున్నారు. ప్రిన్సిపాల్ పోస్టుకు అర్హులైన సీనియర్ ప్రొఫెసర్ల జాబితాలో ప్రొఫెసర్ శశి కంటే ముందు కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన పీవీజీడీ ప్రసాదరెడ్డి, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వెంకటసుబ్బయ్య, సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన జీవీఆర్ శ్రీనివాసరావు, మెరైన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ భానుప్రకాష్ ఉన్నారు. వీరిలో వీసీగా పనిచేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రసాదరెడ్డి మినహాయిస్తే మిగిలిన వారికి అవకాశం కల్పించవచ్చు. కానీ, శశిని నియమించడంపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఉక్కులో జాబ్ రొటేషన్ పాలసీ
మూడేళ్లకొకసారి విభాగాల మార్పు
ఇబ్బందులు తప్పవంటున్న ఉద్యోగ వర్గాలు
మెడికల్, లీగల్, పారామెడికల్, కంపెనీ సెక్రటరీ విభాగాలకు మినహాయింపు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. త్వరలో ఉద్యోగులకు జాబ్ రొటేషన్ పాలసీని అమలు చేస్తామని ప్రకటించింది. దీనికి జాబితా రూపొందిస్తున్నామని పేర్కొంది. ఇందులో ప్రత్యేక అవసరాల కోసం నియమించుకున్న మెడికల్, లీగల్, పారామెడికల్, అధికార భాష, కంపెనీ సెక్రటరీ విభాగాల వారికి మినహాయింపు ఇచ్చింది. అయితే టెక్నికల్ పనులు చేసే విభాగాల్లోను దీనిని అమలు చేస్తామని ప్రకటించడంపై ఉద్యోగ వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు అమలు చేస్తున్న విధానాలను స్టీల్‌ప్లాంటు వంటి భారీ పరిశ్రమల్లో అమలు చేయాలనుకోవడం అవివేకమని, చాలా ఇబ్బందులు వస్తాయని, ఆశించిన ఫలితాలు రావని చెబుతున్నారు. ఉత్పత్తి లక్ష్యాలు నిర్దేశించుకొని వాటి కోసం పని గంటలు పెంచిన ప్రస్తుతం తరుణంలో ఒక విభాగంలో కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని తీసుకువెళ్లి కొత్త విభాగంలో వేస్తే అక్కడి పని నేర్చుకోవడానికి కనీసం ఏడాది సమయం పడుతుందంటున్నారు. వారికి పని నేర్పించే క్రమంలో సీనియర్ల పని గంటలు తగ్గుతాయని అంటున్నారు. బ్లాస్ట్ ఫర్నేస్‌లో పనిచేసే వారిని తీసుకువెళ్లి స్టీల్ మెల్టింగ్ షాపులో వేస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా కొంతకాలం పనిచేస్తే అలవాటు అవుతుందని, కానీ ప్లాంటును ఆర్థికంగా నిలబెట్టాలని అనుకుంటున్న తరుణంలో ఈ ప్రయోగాలు దేనికనే వాదన వినిపిస్తోంది. పైగా ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో, వారిలో మూడో వంతు మందిని...ఇలా జాబ్ రొటేషన్ కింద ఇతర విభాగాలు, సెక్షన్లు, ప్రాంతాలకు మారుస్తామని యాజమాన్యం చెబుతోంది. ఇలా ప్రతి మూడేళ్లకు ఒకసారి మారుస్తామని, ఏటా ఏప్రిల్‌లో ఈ జాబితా ఆటోమేటిక్‌గా తయారయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎగ్జిక్యూటివ్‌ల స్థాయిలో అంటే కార్యాలయంలో కూర్చుని సమీక్షలు చేసే స్థాయి అధికారులకు ఏ విభాగం మార్చినా ఇబ్బంది లేదని, పరికరాలు పట్టుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి ఈ నిర్ణయం ఇబ్బందికరమని అంటున్నారు. ఆపరేషన్, ప్రాజెక్ట్సు, కమర్షియల్ అన్ని విభాగాల్లో దీనిని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆరోగ్య శాఖ ఆర్డీ కార్యాలయంలో విచారణ
బదిలీలు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టుల భర్తీ, పదోన్నతుల్లో
అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు
29, 30 తేదీల్లో ఎంక్వయిరీ
విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయంలో అక్రమాలు జరిగాయంటూ అందిన ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఆరోగ్య శాఖ జోన్-1 కార్యాలయంలో అనేక అవకతవకలు జరిగాయంటూ ఉన్నతాధికారులకు పాత రేసపువానిపాలెం ప్రాంతానికి చెందిన ఎంవీఎన్ మూర్తి ఫిర్యాదు చేశారు. ఆర్డీ కార్యాలయంలో 2022-2023 మధ్యకాలంలో నిర్వహించిన సాధారణ బదిలీలు, 2022 నుంచి 2024 మధ్యకాలంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టుల భర్తీ, బదిలీలతోపాటు ఇతర కేడర్ ఉద్యోగుల పదోన్నతుల్లో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన జాయింట్ డైరెక్టర్‌ను నియమించారు. ఆయన ఈ నెల 29, 30 తేదీల్లో ఆర్డీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు. విచారణకు హాజరుకావాలని అప్పట్లో ఆర్డీ కార్యాలయంలో పనిచేసిన అధికారులు, నియామక, బదిలీ ప్రక్రియలో భాగస్వాములైన ఉద్యోగులకు అధికారులు ఇప్పటికే సమాచారాన్ని అందించారు. ఈ నెల 29న నిర్వహించే విచారణకు గతంలో ఆర్డీ కార్యాలయంలో పనిచేసిన పది మంది ఉద్యోగులతోపాటు 2022లో నిర్వహించిన ప్రమోషన్ కౌన్సెలింగ్ భాగస్వాములైన మరో ఆరుగురు అధికారులు హాజరుకావాలని, 30న గతంలో కార్యాలయంలో పనిచేసిన ఏడుగురు ఉద్యోగులకు, మరో పది మంది వరకు ఆఫీస్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లకు ఆర్డీ కార్యాలయం నుంచి సమాచారాన్ని అందించారు. ఈ కార్యాలయంపై గతంలో పెద్దఎత్తున ఆరోపణలు రావడం, ఇప్పుడు ఆయా అంశాలపై విచారణ జరుగుతుండడంతో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.