Share News

సాంకేతిక పరిజ్ఞానంతో కాఫీ పార్చిమెంట్‌ తయారీ

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:37 AM

ఆదివాసీ రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కాఫీ పార్చిమెంట్‌ తయారీకి మోటారు పల్పర్లను వినియోగిస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో కాఫీ పార్చిమెంట్‌ తయారీ
లంబసింగిలో మోటార్‌ పల్పర్‌తో పండ్లను పల్పింగ్‌ చేస్తున్న మహిళా రైతు

మోటారు పల్పర్‌ సహాయంతో కాఫీ పల్పింగ్‌

పనుల్లో ఆదివాసీ రైతులు నిమగ్నం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం

చింతపల్లి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కాఫీ పార్చిమెంట్‌ తయారీకి మోటారు పల్పర్లను వినియోగిస్తున్నారు. మార్కెట్‌లో పార్చిమెంట్‌కి అధిక ధర లభిస్తుండడంతో కాఫీ పండ్లను పల్పర్‌ సహాయంతో పల్పింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాఫీ దిగుబడులు ప్రారంభంకావడంతో ఆదివాసీ రైతులు పండ్లను సేకరించడం, వెంటనే పల్పింగ్‌ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.

గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు అరవైఏళ్ల క్రితం నుంచి కాఫీని సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్నారు. కాఫీ సాగులో కాలక్రమేణా మెలకువలు నేర్చుకుంటూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. గిరిజన ప్రాంత రైతులు సాగు చేస్తున్న అరకు కాఫీ విశిష్టత ఖండాంతరాలకు విస్తరించింది. కాఫీ సాగు, మార్కెటింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. కాఫీ మార్కెటింగ్‌కి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండింగ్‌ తీసుకొస్తున్నారు. దీంతో కాఫీకి గత ఏడాది రికార్డు స్థాయిలో ధరలు లభించాయి. కాఫీ చెర్రీ కంటే పార్చిమెంట్‌కి రెట్టింపు ధర లభిస్తుంది. గతంలో ఆదివాసీ రైతులు కాఫీ పండ్లను సైతం చెర్రీగా తయారు చేసుకుని విక్రయించేవారు. దీంతో రైతులు 50 శాతం ధరను నష్టపోయేవారు. గిరిజన రైతులు పార్చిమెంట్‌ కాఫీ తయారీ చేసేందుకు కేంద్ర కాఫీ బోర్డు ప్రోత్సహిస్తూ రాయితీపై బేబీ పల్పర్లను పంపిణీ చేసింది. ఈ పల్పర్లను మాన్యువల్‌గా(చేతితో) పండ్లను పల్పింగ్‌ చేయాల్సి వచ్చేంది. దీంతో పార్చిమెంట్‌ తయారీకి అధికంగా శ్రమించాల్సివస్తుందని రైతులు పార్చిమెంట్‌ తయారీపై ఆసక్తి చూపలేదు. దీంతో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం మోటారు పల్పర్లను గత ఏడాది కేంద్ర కాఫీ బోర్డు ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మోటారు పల్పర్లను 50 శాతం రాయితీపై కేంద్ర కాఫీ బోర్డు పంపిణీ చేస్తున్నది. ఈ పథకం అర్హులైన ప్రతి గిరిజన రైతుకు వర్తింపజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ఆదివాసీ రైతులు ప్రస్తుతం మోటారు పల్పర్లను రాయితీపై కొనుగోలు చేసుకుని వినియోగిస్తున్నారు. రైతులు తోటలో సేకరించిన పండ్లను వెనువెంటనే మోటారు పల్పర్‌ సహాయంతో పల్పింగ్‌ చేసుకుని పార్చిమెంట్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం గిరిజన సహకార సంస్థ, మ్యాక్స్‌ గరిష్ఠ ధరలకు కాఫీ పండ్లు, గింజలను కొనుగోలు చేస్తున్నది. గిరిజన రైతులు కాఫీని పార్చిమెంట్‌ తయారీకి ఆసక్తి చూపడం వల్ల ఈ ఏడాది అధిక ఆదాయం పొందే అవకాశముందని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Nov 25 , 2026 | 12:37 AM