Share News

అసంపూర్తి రోడ్డుతో అవస్థలు

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:14 PM

జిల్లా కేంద్రం శివారున అసంపూర్తిగా ఉన్న ఓ రోడ్డుతో జనం నిత్యం అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని పాడేరు-చింతపల్లి మెయిన్‌రోడ్డులో కాన్వెంట్‌ కూడలి నుంచి రోడ్ల, భవనాల శాఖ అతిథిగృహానికి ఒక కిలోమీటరు రోడ్డు పది నెలలుగా అసంపూర్తిగానే వదిలేశారు.

అసంపూర్తి రోడ్డుతో అవస్థలు
కోతకు గురై ప్రమాదభరితంగా ఉన్న రోడ్డు

సీఎం రాక సందర్భంగా జూన్‌లో ప్రారంభించి నేటికీ పూర్తికాని పరిస్థితి

వర్షాలకు కొట్టుకుపోయి ప్రమాదాలకు కారణమవుతున్న దుస్థితి

పర్యాటకులకు తప్పని తిప్పలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్రం శివారున అసంపూర్తిగా ఉన్న ఓ రోడ్డుతో జనం నిత్యం అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని పాడేరు-చింతపల్లి మెయిన్‌రోడ్డులో కాన్వెంట్‌ కూడలి నుంచి రోడ్ల, భవనాల శాఖ అతిథిగృహానికి ఒక కిలోమీటరు రోడ్డు పది నెలలుగా అసంపూర్తిగానే వదిలేశారు. గతేడాది జూన్‌ నెలలో పెన్షన్‌ పంపిణీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లగిశపల్లి పంచాయతీ ఉగ్గంగొయ్యి గ్రామానికి వస్తారని ఈ రోడ్డు అభివృద్ధి పనులను అధికారులు ప్రారంభించారు. అయితే ఈ మార్గంలో సీఎం కార్యక్రమం లేకపోవడంతో రోడ్డు పనులను పూర్తి చేయకుండా వదిలేశారు.

ఈ రోడ్డుపై ఎందుకీ నిర్లక్ష్యం

రోడ్ల, భవనాల శాఖకు చెందిన ఇంజనీర్లు ఈ రోడ్డుపై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. గతేడాది జూన్‌ నెలలోనే రూ.1 కోటి 17 లక్షల వ్యయంతో దానిని నిర్మించాలని భావించి, రోడ్డు వెడల్పు చేయడం, మెటల్‌ వేసి రోలింగ్‌ వంటి పనులు చేశారు. కాని మరోమారు రోలింగ్‌ చేసి తారువేసి పూర్తి చేయాల్సి ఉండగా, తర్వాత అధికారులు పట్టించుకోవడం లేదు. అయితే ఈరోడ్డు దుస్థితిపై అధికారులు ఎందుకు పట్టించుకోలేదనేది కనీసం తెలియడం లేదు. దీంతో గత పది నెలలుగా రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా వదిలేయడంపై కొత్తపాడేరు, గొందూరు వాసులతోపాటు ఆ మార్గంలో రాకపోకలు సాగించే లగిశపల్లి, వంజంగి, కాడెలి పంచాయతీలకు చెందిన ప్రజలు, పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదభరితంగా అసంపూర్తి రోడ్డు

గతేడాది జూన్‌ నుంచి అసంపూర్తిగా రోడ్డును వదిలేయడంతో ప్రస్తుతం అది ప్రమాదభరితంగా మారింది. గతంలో అధికంగా వర్షాలు కురవడంతో మెటల్‌ పరచి ఉన్న ఆ రోడ్డుకు ఇరువైపులా అంచులు కొట్టుకుపోయి, గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు కార్లతోపాటు ద్విచక్రవాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యాయి. ఈ సమస్యను గుర్తించిన కొత్తపాడేరు వాసులు రోడ్డు అంచుల గతుకులను వాహన చోదకులు గుర్తించేందుకు హెచ్చరికగా కర్రలను పాతిపెట్టారు. ఇదిలా ఉండగా వంజంగి హిల్స్‌కు పర్యాటకులు రాకపోకలు సాగించే క్రమంలోనూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అధ్వాన రోడ్డుతో స్థానికులు, పర్యాటకులకు అవస్థలు తప్పడం లేదని పెదవి విరుస్తున్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:14 PM