Share News

సమస్యలు ఏకరువు

ABN , Publish Date - Mar 01 , 2026 | 01:34 AM

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పాలకవర్గ చిట్టచివరి సమావేశంలో సమస్యలను సభ్యులు ఏకరువు పెట్టారు.

సమస్యలు ఏకరువు

జీవీఎంసీ చివరి సర్వసభ్య సమావేశంలో గళం విప్పిన సభ్యులు

ఐదేళ్ల కాలంలో చేసిన పనులకు శిలాఫలాకాలు ఏర్పాటు చేయాలని కొందరి డిమాండ్‌

పారిశుధ్యం, వీధి దీపాల సమస్యలు ప్రస్తావించిన మరికొందరు

స్టాండింగ్‌ కౌన్సిల్‌ పనితీరుపై అసంతృప్తి

కుక్కలు, పందుల స్వైరవిహారంపై ఆందోళన

తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు మేయర్‌ ఆదేశం

68 అంశాలపై సభలో చర్చ...అన్నింటికీ ఆమోదం

విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి):

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పాలకవర్గ చిట్టచివరి సమావేశంలో సమస్యలను సభ్యులు ఏకరువు పెట్టారు. జీవీఎంసీ పాలకవర్గ పదవీకాలం మార్చి 15వ తేదీతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో చివరి సర్వసభ్య సమావేశాన్ని శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా అర్ధగంట ఆలస్యమైంది. సమావేశం ప్రారంభమైన అనంతరం జీరో అవర్‌లో పలువురు సభ్యులు మాట్లాడుతూ కార్పొరేటర్లుగా తమకు అవకాశం కల్పించిన ఓటర్లు, పార్టీ ముఖ్య నాయకులకు కృతజ్ఞతలను తెలుపుతూ భోవోద్వేగానికి లోనయ్యారు. అనంతరం సమస్యలను ప్రస్తావించారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వార్డుల్లో చేసిన పనులకు సంబంధించి శిలాఫలకాలను చాలాచోట్ల ఏర్పాటు చేయలేదని పలువురు సభ్యులు మేయర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఐదేళ్ల పదవీకాలం ముగుస్తోందని, ఇప్పటికైనా శిలాఫలకాలను ఏర్పాటుచేస్తే తాము చేసిన పనులపై స్థానిక ప్రజలకు స్పష్టత లభిస్తుందని పేర్కొన్నారు. తొలుత ఈ విషయాన్ని వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ బానాల శ్రీనివాసరావు ప్రస్తావించగా, ఆ తరువాత మరికొందరు సభ్యులు అదే విషయం మాట్లాడారు. 78వ వార్డులో ఉన్న డంపింగ్‌ యార్డు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని టీడీపీ కార్పొరేటర్‌ గంధం శ్రీనివాస్‌ సభ దృష్టికి తీసుకువచ్చారు. దానిని మరోచోటకు తరలించాలని ఆయన కోరారు. గంగవరం పోర్టు నుంచి విపరీతమైన కాలుష్యం వస్తోందని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, పద్మశ్రీ డాక్టర్‌ ఆదినారాయణ విగ్రహాలను ఏర్పాటు చేయాలని జనసేన కార్పొరేటర్‌ కందుల నాగరాజు కోరారు. జీవీఎంసీ పాలకవర్గం గడువు ముగిసిన వెంటనే జాప్యం లేకుండా ఎన్నికలు నిర్వహించేలా తీర్మానం చేయాలని సీపీఎం కార్పొరేటర్‌ గంగారావు కోరారు. గంగవరం పోర్టు వల్ల తీవ్రమైన కాలుష్యం వెదజల్లడంతోపాటు హెవీ వెహికల్స్‌ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రత్యామ్నాయం ఆలోచించాలని ఆయన కోరారు. శానిటేషన్‌ వర్కర్ల కొరతతో పారిశుధ్య సమస్య తలెత్తుతోందని జనసేన ఫ్లోర్‌ లీడర్‌ భీశెట్టి వసంతలక్ష్మి, బీజేపీ కార్పొరేటర్‌ గంగుల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. సీపీఐ కార్పొరేటర్‌ ఏజే స్టాలిన్‌ మాట్లాడుతూ కణితి రోడ్డుకు రూ.13 కోట్లు మంజూరు చేశారని, రెండు, మూడు రోజుల్లో భూమి పూజ చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 86వ వార్డులో 40 శాతం మంది అపార్టుమెంట్‌ వాసులు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్‌ లేళ్ల కోటేశ్వరరావు పేర్కొన్నారు. జీవీఎంసీ పరిధిలో కోట్లాది రూపాయలు వెచ్చించి శ్మశాన వాటికలు అభివృద్ధి చేశామని, వాటిలో కేర్‌ టేకర్లను నియమించకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని టీడీపీ కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు.

పెద్దలకు రాయితీలు.. పేదలపై పన్నుల పిడుగు

జీరో అవర్‌ అనంతరం భోజన విరామం తీసుకున్న సభ్యులు తిరిగి సాయంత్రం 3.30 గంటలకు సమావేశ మందిరంలోకి వచ్చారు. ఈ సందర్భంగా 37 అంశాలతో కూడిన ప్రధాన అజెండా, మరో 31 అంశాలతో కూడిన టేబుల్‌ అజెండా సభ ముందుంచగా, కొన్నింటిపై సభ్యులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. పలువురు కార్పొరేటర్లు తమ పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రధాన అజెండాలోని అంశాలపై సందేహాలను వ్యక్తం చేయగా, అధికారులు నివృత్తి చేశారు. ప్రధాన అజెండాలోని ఆరో అంశమైన రోడ్లపై సంచరించే శునకాలు, పందులు, పశువుల నియంత్రణపై విస్తృతమైన చర్చ జరిగింది. కుక్కలను ఉదయం తీసుకువెళ్లి మళ్లీ సాయంత్రం తీసుకువచ్చి అక్కడే వదిలేస్తున్నారని, ప్రతి వీధిలో 20కుపైగా పందులు ఉంటున్నాయని టీడీపీ కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిల్లలను కుక్కలు కరుస్తున్నాయని, బైక్‌పై వెళుతుంటే వెంట పడుతున్నాయని మరికొందరు కార్పొరేటర్లు వాపోయారు. దీనిపై స్పందించిన మేయర్‌ పీలా శ్రీనివాసరావు కూడా పందులు, కుక్కల విషయంలో యంత్రాంగం తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. గాజువాక ప్రాంతంలో ఎక్కువగా పందుల పెంపకం జరుగుతోందని, ముగ్గురు వ్యక్తులు నగరమంతా ఈ వ్యాపారాన్ని చేస్తున్నారని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. ఇన్‌స్పెక్టర్ల దగ్గర నుంచి పెంపకందారులకు సమాచారం వెళుతోందని, దీనిని సీరియస్‌గా తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. అనంతరం 35వ అంశంపై సభలో సుమారు రెండు గంటలపాటు విస్తృత చర్చ జరిగింది. జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ జీవీఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ పనితీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వంద కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, పరిష్కరించేందుకు లీగల్‌ టీమ్‌ లేదన్నారు. అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో సమావేశాన్ని ఏర్పాటుచేసి ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. జ్ఞానాపురం వద్ద నడుస్తున్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం జీవీఎంసీకి రూ.ఐదు కోట్లు చెల్లించకుండా ఎగ్గొటిందని సీపీఐ ఫ్లోర్‌ లీడర్‌ ఏజే స్టాలిన్‌ సభకు తెలియజేశారు. జీవీఎంసీకి అనేకమంది ఫీజులు ఎగ్గొడుతున్నారని, ఆయా కేసులు వాదించడంలో న్యాయవాదులు విఫలమవుతున్నారన్నారు. దీనిపై కమిషనర్‌ వివరణ ఇస్తూ..పట్టణ పురపాలక శాఖకు ఒకే ఒక ఎమ్మెస్సీ ఉన్నారని, ఆయన రాష్ట్ర వ్యాప్త కేసులను చూడాల్సి వస్తోందన్నారు. ఇనార్బిట్‌మాల్‌ నిర్మాణంలో అనేక అవకతవకలు ఉన్నాయని, ఇటీవల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇవ్వడంలో భారీ అవినీతి జరిగిందని మూర్తియాదవ్‌ ఆరోపించారు. బీచ్‌ రోడ్డులో వీఎల్‌టీ లేకుండా 26 ఫోర్ల నిర్మాణానికి వరుణ్‌ సంస్థకు డీటీసీసీ అనుమతి ఇవ్వడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అనంతరం 31 అంశాలతో కూడిన టేబుల్‌ అజెండాపై సభ్యులు చర్చించారు. టేబుల్‌ అజెండాలో 29వ అంశం...వెలంపేట మురికవాడ అభివృద్ధిపై జరిగింది. పీపీపీ ముసుగులో విలువైన స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంపై మరోసారి సమీక్షించాలని పలువురు సభ్యులు కోరారు. దశల వారీగా ఎన్ని స్లమ్స్‌ను అభివృద్ధి చేయనున్నారో చెప్పాలని కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్‌ పీపీపీ విధానంలో చేస్తున్నామని, రూ.2.5 లక్షలు లబ్ధిదారులు, రూ.2.5 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయన్నారు. నగర పరిధిలో ఎన్ని మురికివాడలు ఉన్నాయని మూర్తియాదవ్‌ ప్రశ్నించగా 66 ఉన్నాయని, అందులో 50 రాష్ట్ర ప్రభుత్వ స్థలాల్లో ఉండగా, 16 కేంద్ర ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయని కమిషనర్‌ బదులిచ్చారు. ప్రధాన అజెండాలోని 37 అంశాలు, టేబుల్‌ అజెండాలోని 31 అంశాలను అభ్యంతరాలు లేకుండా చర్చలు, సూచనలు ద్వారా సభ ఆమోదించింది.

స్పోర్ట్స్‌ వద్దు..టూర్‌కు పట్టు..

సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని మేయర్‌ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు. దీనిపై పలువురు మహిళా సభ్యులు క్రీడా పోటీలు వద్దని, టూర్‌కు తీసుకువెళ్లాలని కోరుతూ మేయర్‌, కమిషనర్‌ను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ఐదేళ్లపాటు కార్పొరేటర్‌గా పని చేసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. ఐదేళ్ల కాలంలో తమ తప్పులు ఉంటే మన్నించాలని సహచర సభ్యులను, అధికారులను పలువురు సభ్యులు కోరారు. గతానికి భిన్నంగా చివరి సమావేశం ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగింది.

కార్పొరేటర్ల గౌరవ వేతనం పెంచుతూ తీర్మానం చేయండి

ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

కౌన్సిల్‌ సమావేశంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ కార్పొరేటర్లు సభ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించేలా చూడాలని అధికారులను కోరారు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు వేరే పేర్లతో కాంట్రాక్టులు చేస్తున్నారని, వాటికి చెక్‌ చెప్పేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్లానింగ్‌ డిపార్టుమెంట్‌పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయన్నారు. కార్పొరేటర్లకు ఇచ్చే గౌరవ వేతనం చాలా తక్కువగా ఉందని, పెంపుదలకు సంబంధించి తీర్మానం చేసి అసెంబ్లీకి పంపించాలని ఆయన సూచించారు.

Updated Date - Mar 01 , 2026 | 01:34 AM