Share News

‘ఉత్తుత్తి కళాశాలల’పై విచారణ

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:53 AM

మండలంలోని ఆవసోమవరం గ్రామంలో ‘ఉత్తుత్తి కళశాలల’పై కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్పందించారు. కళాశాలలు ఏర్పాటు చేయకుండా, గత కొన్నేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంటు పొందుతున్న కళశాలల నిగ్గు తేల్చాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)ని ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణాధికారిగా జిల్లా ఇంటర్‌ విద్యా శాఖధికారి (డీఐఈవో) మద్దిల వినోద్‌బాబును డీఎంహెచ్‌ఓ నియమించారు.

‘ఉత్తుత్తి కళాశాలల’పై   విచారణ

డీఎంహెచ్‌వోకు కలెక్టర్‌ ఆదేశాలు

విచారణాధికారిగా డీఐఈవో నియామకం

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

అచ్యుతాపురం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆవసోమవరం గ్రామంలో ‘ఉత్తుత్తి కళశాలల’పై కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్పందించారు. కళాశాలలు ఏర్పాటు చేయకుండా, గత కొన్నేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంటు పొందుతున్న కళశాలల నిగ్గు తేల్చాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)ని ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణాధికారిగా జిల్లా ఇంటర్‌ విద్యా శాఖధికారి (డీఐఈవో) మద్దిల వినోద్‌బాబును డీఎంహెచ్‌ఓ నియమించారు.

వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఉమ్మడి జిల్లాలో నర్సింగ్‌ కళశాలల ఏర్పాటుకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇచ్చేశారు. ఆయా కళాశాలలకు అనుమతులు ఇచ్చింది ఒకచోట అయితే..వాటిని వేరే చోట నిర్వహిస్తున్నారు. ఇంకా కొన్ని కళాశాలలు పేపర్లకే పరిమితమై ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంటు సొమ్ము స్వాహా చేశాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును విద్యార్థులకు కాకుండా..నేరుగా ఆయా కళాశాలల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాలని నిర్ణయించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిల సొమ్ము విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అయ్యింది. ఇందుకోసం ఫీజు రీయింబర్స్‌మెంటు డబ్బులను ఆయా కళాశాలల బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి పాన్‌ కార్డులను ఙ్ఞానభూమి పోర్టల్‌లో బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అనకాపల్లి జిల్లాలో 40 కళాశాలలు వున్నాయి. వీటిల్లో మూడు కళాశాలలు అచ్యుతాపురం మండలం ఆవసోమవరం గ్రామంలో వున్నాయి. కానీ వాస్తవంగా ఆవసోమవరం గ్రామంలో ఒక్క కళాశాల కూడా లేదు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఉత్తుత్తి కళశాలల’ పేరుతో శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. దీనిపై విచారణ జరపాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ హైమావతిని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఆమె విచారణాధికారిగా జిల్లా ఇంటర్‌ విద్యా శాఖ అధికారి మద్దిల వినోద్‌బాబును నియమించారు. ఆయన సోమ, మంగళవారాల్లో సమగ్ర విచారణ జరిపి, డీఎంహెచ్‌వో ద్వారా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తారని తెలిసింది.

Updated Date - Jul 13 , 2026 | 12:53 AM