Share News

ప్రైవేటు ట్రావెల్స్‌ దోపిడీ

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:57 AM

సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు.

ప్రైవేటు ట్రావెల్స్‌ దోపిడీ

హైదరాబాద్‌ నుంచి విశాఖకు రూ.5,924 వసూలు

సంక్రాంతి తరువాతా అదే పరిస్థితి

గరిష్ఠంగా రూ.6,250...

పండుగ డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులు

రవాణా శాఖ అధికారుల హెచ్చరికలు బేఖాతరు

‘‘పెందుర్తికి చెందిన మళ్లనాయుడు ఈ నెల ఐదున ఒక ప్రైవేటు ట్రావెల్స్‌లో హైదరాబాద్‌ వెళ్లేందుకు రూ.1,500కి టిక్కెట్‌ కొనుగోలు చేశారు. ఈనెల 20న మరోసారి హైదరాబాద్‌ వెళ్లేందుకు అదే ట్రావెల్స్‌ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే టికెట్‌ ధర రూ.ఏడు వేలుగా కనిపించింది. వెంటనే విశాఖ రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఒక ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి ట్రావెల్స్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లి టిక్కెట్‌ ధరలను సవరించి పెట్టించడంతోపాటు మరోసారి ఫిర్యాదు వస్తే పర్మిట్‌ రద్దు చేస్తామని హెచ్చరిస్తూ నోటీసు జారీచేశారు.’’

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఉద్యోగం, ఉన్నత విద్య నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారంతా పండుగను సొంతూరిలో కుటుంబసభ్యుల మధ్య జరుపుకునేందుకు ఆసక్తి చూపుతారు. రైళ్లలో రిజర్వేషన్‌ దొరకడం కష్టం కావడంతో చాలామంది ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తారు. ట్రావెల్స్‌ నిర్వాహకులు ఇదే అదనుగా డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు టికెట్‌ ధరలను భారీగా పెంచేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అయిన హైదరాబాద్‌కు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కొన్ని లక్షల మంది ఉద్యోగ, ఉపాధి, ఉన్నత విద్య కోసం తరలివెళ్లారు. రాష్ట్ర విభజన జరిగినా ఇప్పటికీ అదే సంప్రదాయం కొనసాగుతోంది. వీరంతా సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చి కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. రెండు, మూడు రోజులు గడిపిన తర్వాత తిరిగి హైదరాబాద్‌ ప్రయాణమవుతారు. రైళ్లలో రిజర్వేషన్‌ రెండు నెలలు ముందుగా అందుబాటులో ఉంచుతారు. సంక్రాంతికి సొంతూళ్లకు ప్రయాణాలు పెట్టుకున్నవారు రిజర్వేషన్‌ అందుబాటులోకి వచ్చిన రోజే (కోటా విడుదల చేసిన రోజు) బుక్‌చేసుకునేందుకు పోటీపడతారు. కోటా విడుదలైన రోజే ఉత్తరాంధ్ర వైపు వచ్చే రైళ్లలో టికెట్లు బుక్‌ అయిపోతాయి. దీంతో మిగిలినవారంతా తప్పనిసరి పరిస్థితితో ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది. తెలంగాణ, ఏపీ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ బస్సులో సేవలు, సౌకర్యం నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్‌ వైపు అత్యధికులు మొగ్గుచూపుతారు. ఈ పరిస్థితిని ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విద్యాసంస్థలు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్‌ నుంచి ప్రయాణాలు మొదలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు శని, ఆదివారాలు అధికారిక సెలవులు కాగా మంగళవారం ఐచ్చికసెలవు, బుధ, గురువారాలు అధికారిక సెలవు దినాలుగా ప్రకటించింది. సోమవారం ఒక్కరోజు సెలవుపెడితే ఆరు రోజులపాటు వరుసగా సెలవు దొరుకుతుంది. సెలవు దొరకనివారు, ప్రైవేటు ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో ప్రయాణాలు పెట్టుకున్నారు. దీంతో ఈ నెల తొమ్మిది నుంచే హైదరాబాద్‌ నుంచి నగరానికి వచ్చే ప్రైవేటు ట్రావెల్స్‌కు తాకిడి పెరిగింది.

టికెట్‌ రేట్లు భారీగా పెంచేసిన ట్రావెల్స్‌

సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి నగరానికి వచ్చే ప్రైవేటు ఏసీ బస్సులో స్లీపర్‌ సీటు రూ.1,300 నుంచి రూ.2,500 వరకు ఉంటోంది. అయితే సంక్రాంత్రి నేపథ్యంలో ఈనెల తొమ్మిది నుంచి 14 వరకూ టిక్కెట్‌ ధరలను రెట్టింపు చేసేశారు. కొన్ని ట్రావెల్స్‌ అయితే రెట్టింపు కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్‌-విశాఖపట్నం టికెట్‌ను పరిశీలిస్తే కనిష్ఠంగా రూ.3,500 ఉండగా, గరిష్ఠంగా రూ.5,924 వసూలు చేస్తున్నారు. సోమవారం కనిష్ఠం రూ.3,950, గరిష్ఠంగా రూ.6,050 ఉంది. మంగళ, బుధవారాల్లో కూడా ఇదే మాదిరిగా టికెట్‌ ధరలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చినవారంతా సంకాంత్రి తర్వాత తిరుగు ప్రయాణాలు పెట్టుకుంటారు. దీంతో నగరం నుంచి హైదరాబాద్‌ వెళ్లే బస్సులకు డిమాండ్‌ భారీగా ఉంటుంది. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు అన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ టికెట్‌ ధరలను భారీగా పెంచేశాయి. కనిష్ఠంగా రూ.3,250 కాగా, గరిష్ఠంగా రూ.6,250 వరకు ఉన్నాయి.

ప్రైవేటు ట్రావెల్స్‌ దోపిడీ అడ్డుకట్టకు హెల్ప్‌లైన్‌

ఇన్‌చార్జి డీటీసీ ఆర్‌సీహెచ్‌ శ్రీనివాస్‌

ప్రయాణికులను ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు దోపిడీ చేయకుండా అడ్డుకునేందుకు రవాణా శాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌సిన్హా ఆదేశాల మేరకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటుచేశాం. ఆర్టీసీ టికెట్‌ కంటే 50 శాతం అధికంగా విక్రయించుకునేందకు మాత్రమే ప్రైవేటు ట్రావెల్స్‌కు అవకాశం ఉంది. అంతకుమించి రేటు ఎవరైనా వెబ్‌సైట్‌లో టిక్కెట్లను అందుబాటులో ఉంచినా, బస్సు ఎక్కిన తర్వాత అదనంగా ఇవ్వాలని డిమాండ్‌ చేసినా సరే కంట్రోల్‌రూమ్‌ నంబర్‌ 9281607001కి సమాచారం ఇస్తే చాలు. సంకాంత్రి రద్దీ కొనసాగినన్ని రోజులూ ముగ్గురు ఎంవీఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. టిక్కెట్‌ ధరలను పెంచితే పర్మిట్‌లను రద్దు చేస్తామని ఇటీవల ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులకు స్పష్టంచేశాం.


ఏడు ట్రావెల్స్‌ బస్సులపై కేసు

విశాఖపట్నం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి నేపథ్యంలో టికెట్‌ ధర పెంచిన ఏడు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులకు జరిమానా విధించినట్టు ఇన్‌చార్జి డీటీసీ ఆర్‌సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. టికెట్‌ ధరలను భారీగా పెంచేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాల్సిందిగా ముగ్గురు ఎంవీఐలను డీటీసీ ఆదేశించారు. ఈ మేరకు ఎన్‌డీఏసీ జంక్షన్‌లో బస్సులను తనిఖీ చేయగా సాధారణ రోజుల్లో కంటే ఏడు బస్సుల్లో ఎక్కువ వసూలు చేసినట్టు ప్రయాణికులు వివరించారు. దీంతో ఆయా బస్సుల నిర్వాహకులకు రూ.33,600 జరిమానా విధించారు. అలాగే ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ లేకుండా తిరుగుతున్న ఒక బస్సుతోపాటు ఇతర ఉల్లంఘనలు కలిగిన నాలుగు బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో ఎంవీఐ బుచ్చిరాజు, ఏఎంవీఐ పార్వతి, ఇతర అఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 12:57 AM