అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ప్రైవేటు రిసార్ట్స్
ABN , Publish Date - Jan 02 , 2026 | 10:35 PM
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో ప్రైవేటు రిసార్ట్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలయ్యాయి. ప్రైవేటు రిసార్ట్స్‌లు మద్యం విక్రయాలు, ఓపెన్ బార్లుగా మారుతున్నాయి. దీనికి తోడు డీజే సౌండ్స్ పెడుతుండడంతో కుటుంబాలతో వచ్చే సందర్శకులు, ఆదివాసీలు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, ఓపెన్ బార్లు
భారీ లౌడ్ స్పీకర్లతో డీజే సౌండ్స్
అవస్థలు పడుతున్న ఆదివాసీలు, సందర్శకులు
పట్టించుకోని అధికార యంత్రాంగం
చింతపల్లి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్ లంబసింగి శీతాకాల వాతావరణం ఉత్తర భారతదేశాన్ని పోలి ఉంటుంది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు లంబసింగి వచ్చే పర్యాటకుల కోసం ప్రభుత్వ పరంగా ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. సుమారు 50 వరకు ప్రైవేట్ రిసార్ట్స్ లంబసింగి, రాజుపాకలు, తాజంగి ప్రాంతాల్లో ఉన్నాయి. రిసార్ట్స్ నిర్వాహకుల దురాశ, నిబంధనలు పాటించకపోవడంతో స్థానిక ఆదివాసీలు, కుటుంబాలతో వచ్చే పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు.
ఓపెన్ బార్లుగా రిసార్ట్స్
లంబసింగి, తాజంగి పర్యాటక ప్రాంతాల్లో రిసార్ట్స్ ఓపెన్ బార్లను తలపిస్తున్నాయి. కొన్ని రిసార్ట్స్ బెల్ట్ దుకాణాలయ్యాయి. కొంతమంది పర్యాటకులు మద్యాన్ని వారి వెంట తీసుకొస్తున్నారు. పర్యాటకులు రిసార్ట్స్ గదుల్లో మద్యం సేవిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. రిసార్ట్స్ బయట మ్యూజిక్ పెట్టుకుని ఓపెన్ బార్లు, క్లబ్‌లు మాదిరిగా మద్యం సేవిస్తున్నారు. ఇందుకు అధిక అద్దెను పర్యాటకులు చెల్లిస్తున్నారు. దీంతో కుటుంబాలతో వచ్చే పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. మద్యం సీసాలను రిసార్ట్స్ పరిసరాల్లో చెల్లాచెదురుగా పడేస్తున్నారు. ఆ పరిసరాల్లో పారిశుధ్యం లోపిస్తున్నది.
సౌండ్ పొల్యూషన్‌తో ఆదివాసీలు అవస్థలు
తాజంగి, లంబసింగిలోని ప్రైవేటు రిసార్ట్స్ వద్ద నిర్వాహకులు డీజే సౌండ్స్‌ని ఏర్పాటు చేసి సౌండ్ పొల్యూషన్ చేయడంతో ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. పోలీసుల అనుమతి తీసుకోకుండా లంబసింగి, తాజంగి ప్రాంతాల్లోనున్న రిసార్ట్స్ నిర్వాహకులు డీజే సౌండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. రోజూ సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు డీజే సౌండ్స్ ఏర్పాటు చేయడంతో వృద్ధులు, చిన్నపిల్లలు, పెద్దవారు సైతం నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారు. గత ఐదు రోజులుగా భీమనాపల్లి సమీపంలో ఓ రిసార్ట్స్ నిర్వాహకుడు డీజే సౌండ్స్ ఏర్పాటు చేశాడు. దీంతో గురువారం రాత్రి డీజే సౌండ్ పొల్యూషన్ భరించలేక స్థానిక గిరిజనులు రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో రాత్రి రెవెన్యూ ఉద్యోగులు, పెసా కమిటీ, గిరిజన రిసార్ట్స్ యూనియన్ నాయకులు, గిరిజనులు వెళ్లి డీజే సౌండ్స్ నిలిపివేయాలని చెప్పినప్పటికి నిర్వాహకుడు కనీసం స్పందించలేదు.
నియంత్రణ లేని అద్దెలు..
ప్రైవేటు రిసార్ట్స్ నిర్వాహకులు నియంత్రణ లేని అద్దె వసూలు చేస్తున్నారు. వీకెండ్స్ శుక్ర, శని, ఆది, సోమవారాలు ప్రకృతి అందాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఈ రోజుల్లో నిర్వాహకులు రిసార్ట్స్ గదులు, టెంట్లు ధరలను భారీగా పెంచేస్తున్నారు. గతంలో ఐటీడీఏ నిర్ణయించిన ధరలకు రిసార్ట్స్ అద్దెకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఐటీడీఏ, కలెక్టరేట్ పర్యవేక్షణ లేకపోవడంతో రిసార్ట్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస సదుపాయాలు లేకపోయినప్పటికీ ఒక గదికి రూ.మూడు వేలు నుంచి రూ.ఆరు వేలు వరకు వసూలు చేస్తున్నారు. అవివాహితులైన యువతీ, యువకుల రిసార్ట్స్ గదులు కేటాయించాల్సి వస్తే ఈ ధరను రెట్టింపు చేస్తున్నారు. విచిత్రమేమిటంటే.. ఏ ఒక రిసార్ట్స్‌కి జీఎస్‌టీ లేదు. అయినా పంచాయతీ పన్ను, జీఎస్టీ అంటూ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికైన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్ పర్యవేక్షించకపోతే లంబసింగి పర్యాటక అభివృద్ధికి తీవ్ర నష్టం జరుగుతుంది. సందర్శకులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. లంబసింగికి అపకీర్తిని మూటగడుతున్న రిసార్ట్స్ నిర్వాహకులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు విజ్ఞప్తి చేస్తున్నారు.