Share News

రిజస్ర్టేషన్‌లో ప్రైవేటు భాగస్వామ్యం!

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:44 AM

రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదించిన ‘సేవా కేంద్రాల’పై విముఖత వ్యక్తమవుతోంది.

రిజస్ర్టేషన్‌లో ప్రైవేటు భాగస్వామ్యం!

పీపీపీలో సేవా కేంద్రాలు ఏర్పాటు ప్రతిపాదనపై అభ్యంతరాలు

ప్రజల వివరాల గోప్యతపై అనుమానాలు

పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌

ప్రస్తుతం ఉన్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకే సొంత భవనాలు లేవు...మళ్లీ సేవా కేంద్రాలా

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదించిన ‘సేవా కేంద్రాల’పై విముఖత వ్యక్తమవుతోంది. వీటిని పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. దళారుల బెడద లేకుండా, పారదర్శకంగా సేవలు అందించడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే స్థిరాస్తుల కొనుగోళ్లు, వీలునామాలు, వారసత్వ ఆస్తుల పంపిణీ వివరాలు వంటివి ఆయా వ్యక్తులు గోప్యంగా ఉండాలని భావిస్తారు. ఇలాంటి వ్యవహారాలను నమోదుచేసే బాధ్యతను పీపీపీలో ఏదో ఒక సంస్థకు అప్పగించడమేమిటనే ప్రశ్న వినిపిస్తోంది.

ప్రభుత్వం ఇప్పటికే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దళారుల ప్రమేయం లేకుండా ఎవరి డాక్యుమెంట్‌ వారు రాసుకోవడానికి ‘పబ్లిక్‌ డేటా ఎంట్రీ (పీడీఈ)’ విధానం అమలు చేస్తోంది. అక్కడ దరఖాస్తు తీసుకొని ఆస్తి వివరాలు, సరిహద్దులు, కొనుగోలుదారు, అమ్మకందారు పేర్లు రాస్తే సరిపోతుంది. రెడీమేడ్‌ డాక్యుమెంట్‌ సిద్ధం అయిపోతుంది. తగిన ఫీజు చెల్తిస్తే రిజిస్ట్రేషన్‌ జరిగిపోతుంది. ఇప్పుడు కొత్తగా సేవా కేంద్రాలు ఏర్పాటుచేస్తే అక్కడ దళారులు ప్రత్యక్షం కారని గ్యారంటీ ఏమీ లేదు. దీనికి ఫీజులు కాకుండా అదనపు రుసుము రూ.2 వేలు చెల్లించాలని అంటున్నారు. డాక్యుమెంట్‌ రైటర్‌ను కక్షిదారులు వ్యక్తిగత సహాయకుడిగా నమ్మి అతడికి వివరాలన్నీ చెప్పి రాయించుకుంటారు. అదే ప్రభుత్వం ఏర్పాటుచేసిన మనిషి (సంస్థ) అనగానే అన్ని విషయాలు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. పైగా ఇప్పుడు ఆస్తి కొనుగోలు చేసినా, అమ్మినా డాక్యుమెంట్‌లో రాసే ధర వేరు. బయట వారికి ఇచ్చే ధనం వేరు. ఇది బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇలాంటివన్నీ సేవా కేంద్రాల్లో చర్చించలేని, ప్రశ్నించలేని అంశాలు. పారదర్శకత అని చెప్పినా అక్కడ పాటించలేని అంశాలన్నీ ఉంటాయి.

పీపీపీ అనగానే ఏదో ఒక సంస్థ కాంట్రాక్టు తీసుకుంటుంది. వారికి సంబంధించిన వ్యక్తులను సేవా కేంద్రాల్లో పెడతారు. వారు సక్రమంగా విధులు నిర్వహిస్తారని చెప్పలేం. సమర్పించిన ఆస్తుల వివరాలు వేరే వ్యక్తులకు చేరవేయకుండా ఉంటారని విశ్వసించలేము. పాస్‌పోర్టు సేవా కేంద్రాల మాదిరిగా రిజిస్ర్టేషన్‌ వ్యవహారాలు నడపాలని ప్రభుత్వం ముందు నుంచి భావిస్తోంది. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో వ్యక్తిగత సమాచారం మాత్రమే ఉంటుంది. ఆధార్‌, వేలిముద్రలు, ఐరిస్‌, సర్టిఫికెట్ల పరిశీలన వరకు మాత్రమే అక్కడి సిబ్బంది పరిమితమవుతారు. మిగిలినవన్నీ పాస్‌పోర్టు కార్యాలయం చూసుకుంటుంది. రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే కోట్ల రూపాయల వ్యవహారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు థర్డ్‌ పార్టీకి సమర్పించాలి. వారి ద్వారా అవి సబ్‌ రిజిస్ట్రార్లకు వెళతాయి. అక్కడి నుంచి క్లియరెన్స్‌ వస్తేనే రిజిస్టర్‌ చేస్తారు. డాక్యుమెంట్‌ రాయడానికి, ఆయా పత్రాలు తీసుకోవడానికి రూ.2 వేలు ఫీజు కట్టాలని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో విశ్వసనీయత ఉండదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సేవా కేంద్రం ఏర్పాటుచేస్తే అక్కడ రోజుకు కనీసం 50 డాక్యుమెంట్లు తీసుకున్నా ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.2 వేలు చొప్పున రోజుకు లక్ష రూపాయల ఆదాయం అధికారికంగా వారికి వస్తుంది. పీపీపీలో కాకుండా ప్రభుత్వమే వీటిని నిర్వహిస్తూ, అక్కడ న్యాయశాస్త్రం చదివిన వారిని కనీసం కాంట్రాక్టు విధానంలో తీసుకున్నా బాధ్యతగా పనిచేస్తారు. అందరికీ నమ్మకం ఏర్పడుతుంది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో 19 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో పది కార్యాలయాలకు సొంత భవనాలే లేవు. అద్దె కూడా సక్రమంగా చెల్లించలేకపోతున్నారు. కార్యాలయాలకు అవసరమైన ప్రింటర్లు, ఇతర సామగ్రి కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరో భవనం తీసుకొని సేవా కేంద్రం ఏర్పాటుచేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.

Updated Date - Jun 27 , 2026 | 12:44 AM