ప్రైవేటు నిర్లక్ష్యం
ABN , Publish Date - Aug 12 , 2026 | 01:09 AM
నకిలీ సర్టిఫికెట్లతో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో చేరే విద్యార్థులకు అడ్డుకట్ట వేయాలన్న ఉన్నతాధికారులు ప్రయత్నాలు సఫలం కావడం లేదు.
ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివి, ఇక్కడ డిగ్రీలో చేరిన విద్యార్థులు
ఈక్వలెన్స్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిందిగా గత ఏడాది ఆగస్టులో ఏయూ ఆదేశం
పట్టించుకోని కళాశాలల యాజమాన్యాలు
ఫీజులు చెల్లించి, పరీక్షలు రాయించిన వైనం
ఫలితాలు నిలిపివేయడంతో ఇప్పుడు గగ్గోలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నకిలీ సర్టిఫికెట్లతో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో చేరే విద్యార్థులకు అడ్డుకట్ట వేయాలన్న ఉన్నతాధికారులు ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చదివినట్టు చెబుతున్న విద్యార్థులు ఈక్వలెన్స్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా వర్సిటీకి సమర్పించాలన్న ఆదేశాలను యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులు కొందరు నకిలీ సర్టిఫికెట్లతో ఇక్కడ డిగ్రీ కాలేజీల్లో చేరుతున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు గత ఏడాది ఆగస్టులో ఇలాంటి విద్యార్థులు ఈక్వలెన్స్ సర్టిఫికెట్లు సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు రెండు, మూడు కాలేజీల నుంచి మాత్రమే విద్యార్థుల ఈక్వలెన్స్ సర్టిఫికెట్లను సమర్పించారు. వర్సిటీ పరిధిలోని సుమారు 25 కాలేజీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు డిగ్రీ, బీబీఎం, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను చదువుతున్నారు. వారు ఇప్పటివరకూ ఈక్వలెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు.
ఆదేశాలు ఉన్నా.. ఫీజుల చెల్లింపు..
ఈక్వలెన్స్ సర్టిఫికెట్లు సమర్పించిన విద్యార్థులకు మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాలని కళాశాలలకు ఏయూ అధికారులు స్పష్టంచేశారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఫీజులు చెల్లించి, పరీక్షలు రాయించినా ఫలితాలు విడుదల చేయబోమని స్పష్టంచేశారు. అయినప్పటికీ అనేక కాలేజీల యాజమాన్యాలు ఈ సర్టిఫికెట్లు ఇవ్వకుండానే ఫీజులు చెల్లించి విద్యార్థులతో పరీక్షలు రాయించాయి. ఈ నిర్లక్ష్య వైఖరిని వర్సిటీ అధికారులు సీరియస్‌గా పరిగణించి, సర్టిఫికెట్లు ఇవ్వని వారి ఫలితాలు హోల్డ్‌లో ఉంచారు.
ఈక్వలెన్స్ అంటే..
ఇతర రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికెట్లతో డిగ్రీలో చేరిన విద్యార్థులంతా ప్రస్తుతం తాము ఉన్న రాష్ట్రంలో ఇంటర్ బోర్డుకు ఈక్వలెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. బోర్డు వాటిని పరిశీలించి సర్టిఫికెట్ జారీచేస్తుంది. లేదంటే ఫేక్‌గా నిర్ధారిస్తుంది.