పుట్టగొడుగుల్లా ప్రైవేటు ఆస్పత్రులు
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:47 AM
పుట్టగొడుగుల్లా ప్రైవేటు ఆస్పత్రులు
ఫోటో:
18ఏకేపీ.1. ఇటీవల అనకాపల్లిలో బాలింత మృతిచెందిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఇదే
అనుమతులు లేకుండా దర్జాగా నిర్వహణ
మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ పేర్లతో ఆర్భాటంగా బోర్డులు
సాధారణ స్థాయిలోనే వైద్య సేవలు
రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు
ప్రైవేటు ఆస్పత్రుల్లో మొక్కుబడిగా తనిఖీలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అంటూ బోర్డులు ఏర్పాటుచేసి రోగుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు లేకుండా పలువురు క్లినిక్‌ల పేరుతో ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులతోపాటు మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా ప్రచారం చేసుకుంటూ ఆ స్థాయిలో ప్రత్యేక వైద్య నిపుణులు, ఆధునిక వైద్య పరికరాలు లేని ఆస్పత్రులపై అధికారుల నిఘా, తనిఖీలు కొరవడ్డాయి. ఇటీవల అనకాపల్లిలో ఒక ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యం వికటించి, బాలింత మృతిచెందిన ఘటన వెలుగులోకి రావడంతో జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతున్నది.
మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివిధ రకాల ప్రత్యేక వైద్య నిపుణులతోపాటు నిర్ణీత సంఖ్యలో పడకలు, క్యాజువాలిటీ, ఐసీయూ, ల్యాబ్, ఎక్స్‌రే, ఆధునాతన ఆపరేషన్ థియేటర్లు ఉండాలి. కానీ ఒకరిద్దరు వైద్యులు, పది నుంచి 20 పడకలతో ఆస్పత్రులను ఏర్పాటు చేస వాటిని మల్టీ స్పెషాలిటీ/ సూపర్ ఆస్పత్రులుగా బోర్డులు తగిలించి నడుపుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 95 మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులు వున్నాయి. వీటిలో దాదాపు సగం (48) ఆస్పత్రులు జిల్లా కేంద్రంలో వున్నాయి. నర్సీపట్నంలో 18, చోడవరంలో ఆరు, అచ్యుతాపురంలో ఆరు, ఎలమంచిలిలో మూడు, కె.కోటపాడు, పాయకరావుపేట, సబ్బవరం, మాడుగుల, రావికమతం, ఎస్.రాయవరం మండలాల్లో రెండేసి, రాంబిల్లి, మాకవరపాలెంలో ఒక్కో ఆస్పత్రికి మాత్రమే డీఎంహెచ్‌వో అనుమతులు ఉన్నాయి. అనకాపల్లిలో 48 ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే ఆనుమతులు ఉండగా, మరో 60 ఆస్పత్రులు అనుమతి లేకుండా నడుస్తున్నట్టు సమాచారం. అలాగా అచ్యుతాపురంలో 10, చోడవరంలో 13, నర్సీపట్నంలో 11 అనుమతి లేని ఆస్పత్రులు వున్నాయని తెలిసింది.
ఇదిలావుండగా వైద్య, ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం జిల్లాలో నాలుగు ఆస్పత్రులకు మాత్రమే ‘మల్టీ స్పెషాలిటీ’ అనుమతులు వున్నాయి. కానీ అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, ఎలమంచిలి, అచ్యుతాపురం ప్రాంతాల్లో కొన్ని సాధారణ ఆస్పత్రులకు మల్టీ స్పెషాలిటీ’ అని బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఆస్పత్రుల్లో వైద్య సేవలు సాధారణంగానే వుంటాయని, ఫీజులు మాత్రం భారీగా వుంటాయని రోగులు చెబుతున్నారు. పట్టణాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లో సైతం మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, ఎమర్జెన్సీ కేర్... ఇలా ఆకర్షణీయమైన పేర్లతో పదుల సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రులు నడుపుతున్నారు. జ్వరం లేదా చిన్నపాటి ఆరోగ్య సమస్యతో ఈ ఆస్పత్రులకు వెళితే.. రకరకాల పరీక్షల పేరుతో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు బిల్లులు వేస్తున్నారు. నిబంధనల ప్రకారం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోఉండాలి. కానీ కొన్ని ఆస్పత్రులకు మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ బోర్డులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అన్ని రకాల వైద్య నిపుణులు అందుబాటులో ఉండడం లేదు.
మొక్కుబడిగా తనిఖీలు...
ప్రైవేటు ఆస్పత్రులపై వివిధ ప్రభుత్వ శాఖల తనిఖీలు మొక్కుబడిగా సాగుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ, ఔషధ నియంత్రణ, అగ్నిమాపక, కార్మిల శాఖల అధికారులు ప్రైవేటు ఆస్పత్రుల్లో తరచూ తనిఖీలు జరపాలి. నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులను నిర్వహిస్తుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి. కానీ పలువురు అధికారులు ఆస్పత్రులను తనిఖీ చేసే ముందు సంబంధిత నిర్వాహకులకు సమాచారం ఇస్తున్నారు. తనిఖీకి వచ్చిన అధికారులు మొక్కుబడిగా ఆస్పత్రి రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు చూసి వెళ్లిపోతున్నారు.
కాగా జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, కనీస ప్రమాణాలు లేకుండా మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రుల గురించి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్.అచ్యుతాంబను వివరణ కోరగా... అనుమతి లేకుండా నడుపుతున్న ఆస్పత్రులను గుర్తించి చర్యలు చేపడతామన్నారు. అనుమతి పొందిన ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనల ప్రకారం అన్ని రకాల వైద్య నిపుణులు వున్నారా? ఆధునిక వైద్య పరికరాలు వున్నాయా? లేదా? అన్నది పరిశీలిస్తామన్నారు.