అన్ని రంగాల్లో విశాఖకు ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 06 , 2026 | 01:22 AM
విశాఖపట్నం అన్ని రంగాల్లోను అభివృద్ధి సాధిస్తున్నదని, ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. బుధవారం నగర పర్యటనకు వచ్చిన ఆయన...రెండు ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తరువాత ఇసుకతోట జంక్షన్‌లో ఉన్న లాన్సమ్ టవర్స్‌లో ‘ఐబీఎం’ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా రెండు చోట్ల మాట్లాడారు. విశాఖపట్నంలో సింధు అకాడమీ ఏర్పాటు ఈ ప్రాంతం వారికి ఒక వరమన్నారు.
మల్టీ స్పోర్ట్స్ సెంటర్‌గా పీవీ సింధు అకాడమీ
క్రీడల్లోను ప్రతిభ చూపాలి
నగరంలో డిజిటల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి
ఐబీఎం మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించడం సంతోషం
ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్
విశాఖపట్నం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం అన్ని రంగాల్లోను అభివృద్ధి సాధిస్తున్నదని, ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. బుధవారం నగర పర్యటనకు వచ్చిన ఆయన...రెండు ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తరువాత ఇసుకతోట జంక్షన్‌లో ఉన్న లాన్సమ్ టవర్స్‌లో ‘ఐబీఎం’ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా రెండు చోట్ల మాట్లాడారు. విశాఖపట్నంలో సింధు అకాడమీ ఏర్పాటు ఈ ప్రాంతం వారికి ఒక వరమన్నారు. జాతి గర్వించదగిన చాంఫియన్లు తయారుకావాలని, అందుకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఏదీ ఒక్క రాత్రిలో సాధ్యం కాదని, క్రమశిక్షణ, సహనం, అచంచల విశ్వాసం ఉన్నవారే ఏ లక్ష్యమైనా సాధించగలుగుతారన్నారు. సింధు అకాడమీలో ఒక్క బ్యాడ్మింటన్‌కే కాకుండా స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్‌బాల్‌కు కూడా శిక్షణ ఇస్తారన్నారు. ఇది మల్టీ స్పోర్ట్ సెంటర్‌గా రూపుదిద్దుకుంటుందన్నారు. క్రీడా రంగంలో ఎదగాలనుకునేవారు గతంలో విదేశాలకు శిక్షణకు వెళ్లేవారని, ఇప్పుడు ఆ అవసరం లేదని, విశాఖలోనే అన్నింటిని నేర్చుకొని ఛాంపియన్లుగా ఎదగవచ్చునన్నారు. పిల్లలంతా చదువులో ప్రతిభ చూపలేరని, ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో ఆసక్తి ఉంటుందని, విద్యా శాఖా మంత్రిగా వాటిని తెలుసుకొని ప్రోత్సహించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందుకే విద్యకు, క్రీడలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. జీవితంలో కొన్ని పాఠాలు ఆటస్థలంలో కూడా నేర్చుకోవలసి ఉంటుందని, దానికి సింధు అకాడమీ వేదికగా నిలుస్తుందన్నారు.
డిజిటల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి
ఐబీఎం ప్రారంభం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రతిభకు కొదవ లేదని, సాంకేతిక రంగానికి అవసరమైన నిపుణులు ఉన్నారని, ఇప్పుడు ప్రపంచం అంతా డిజిటలైజేషన్ దిశగా రూపాంతరం చెందుతున్నదని, దానికి అవసరమైన వాతావరణం నగరంతోపాటు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. డిజిటల్ రంగంలో విశాఖను దేశంలో అగ్రగామిగా తయారుచేస్తామన్నారు. ఐబీఎం విశాఖలో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, తదితరులు పాల్గొన్నారు.