ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యం
ABN , Publish Date - May 26 , 2026 | 12:52 AM
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నదని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.
జిల్లాలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి
కలెక్టర్ విజయకృష్ణన్
ఆర్.భీమవరం, గొండుపాలెంలో ఎంఎస్‌ఎంఈ పార్కులకు ఎమ్మెల్యేలతో కలిసి శంకుస్థాపన
బుచ్చెయ్యపేట, మే 24 (ఆంధ్ర జ్యోతి):
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నదని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మండలంలోని ఆర్.భీమవరంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, జిల్లాలో 172 చిన్న పరిశ్రమలకు భూములు కేటాయించామని, ఇవి వచ్చే ఏడాది డిసెంబర్‌నాటికి పూర్తయి ఉత్పత్తులను ప్రారంభిస్తాయని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కనీసం డిగ్రీ వరకు చదివించాలని, ఒకవేళ ఉద్యోగం రాకపోతే ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. చోడవరం ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని అగ్రికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గోవాడ షుగర్ ప్యాక్టరీలో డిస్టిలరీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు సారథ్యంలో అనకాపల్లి జిల్లాలో నెలకొక కొత్త ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరుగుతున్నదని అన్నారు. జనసేన పార్టీ ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ, ఇటు వ్యవసాయం, ఇటు పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఏపీఐఐసీ డీజడ్‌ఎం సూర్యనారాయణ, తహశీల్దారు ఎం.లక్ష్మి, ఎంపీడీవో శివప్రసాద్, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, ఎంపీపీ నాగేశ్వరి దేవి, పలువురు కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఎంఎస్‌ఎంఈతో యువతకు ఉపాధి
కె.కోటపాడు, మే 25 (ఆంధ్రజ్యోతి): పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మాడుగుల నియోజకవర్గంలో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేయించి, తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. మండలంలోని గొండుపాలెంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు కలెక్టర్ విజయకృష్ణన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించి, అధిక దిగుబడులు సాధించాలని, తద్వారా ఆదాయం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఆర్డీవో ఆయీషా, కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, డీసీఎంఎస్ పర్సన్ ఇన్‌చార్జి కోట్ని బాలాజీ, తహశీల్దారు భుజంగరావు, ఎంపీడీవో సాంబశివరావు, కూటమి నాయకులు రొంగలి మహేశ్, జూరెడ్డి రాము, బత్తి వెంకటరమణ, పూడి నారాయణమర్తి, సబ్బవరపు రామునాయుడు, తదితరులు పాల్గొన్నారు.