ఉపాధి, ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:43 AM
అనకాపల్లి జిల్లాను పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఏపీఐఐసీ సెజ్‌లో రెన్యూ ఎనర్జీ సోలార్ ఇన్‌గాట్-వేఫర్ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టులకు భూమి పూజ
వచ్చే ఏడాది అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు
వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు పుష్కలంగా నీరు
ఉత్తరాంధ్రలో ప్రతిరోజూ పెట్టుబడుల పండుగే
28న గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
ప్రధాని మోదీ సహకారంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నాం
రాంబిల్లి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లాను పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇక్కడ ఏర్పాటుచేసే పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. రాంబిల్లి మండలం జడ్.చింతువ పంచాయతీ గజిరెడ్డిపాలెం వద్ద (ఏపీఐఐసీ ఫేజ్-2 సెజ్) సుమారు ఐదున్నర వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ‘రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ’ ఏర్పాటుచేయనున్న సోలార్ ఇన్‌గాట్-వేఫర్ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ ప్రాజెక్టు పనులకు ఆయన గురువారం భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను తీసుకువస్తామన్నారు. దీనివల్ల వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంతంలో ఏర్పాటుచేసే కంపెనీలు, పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ప్రతిరోజూ పెట్టుబడుల పండుగ జరిగేలా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఈ నెల 28వ తేదీన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో ఏర్పాటుచేయనున్న గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్ధాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో మరో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో యూనిట్లను ఏర్పాటుచేసేందుకు లారస్ ల్యాబ్స్ ముందుకు వచ్చిందన్నారు. ప్రధాని మోదీ సహకారంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నామని, రైల్వే జోన్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతోపాటు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్, రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ సీఎండీ సుమంత్ సిన్హా, కో-ఫౌండర్ వైశాలి నిగమ్ సిన్హా, తదితరులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
అంతకుముందు జడ్.చింతువ హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. వీరిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు సుందరపు విజయ్‌కుమార్, కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీ తుహిన్‌సిన్హా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద, ప్రగడ నాగేశ్వరరావు, మళ్ల సురేంద్ర, పీవీజీ కుమార్, డీసీఎంఎస్ పర్సన్ ఇన్‌చార్జి కోట్ని బాలాజీ, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఉన్నారు.