Share News

బాలికల వసతికి పెద్దపీట

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:43 AM

జిల్లాలో బాలికల విద్యకు, వసతి సదుపాయాల కల్పనకు సర్కారు పెద్దపీట వేస్తున్నది. ముఖ్యంగా ఇళ్ల నుంచి విద్యాలయాలకు రాకపోకలు సాగించే 9 నుంచి 12 తరగతులకు చెందిన బాలికలకు ప్రత్యేక వసతి సదుపాయం కల్పించాలని సమగ్ర శిక్ష అధికారులు భావించారు. దీంతో జిల్లాలో ఎంపిక చేసిన ఎనిమిది మండలాల్లో రూ.20 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా వసతి భవనాలను సమకూర్చుతున్నారు. ఫలితంగా రానున్న రోజుల్లో బాలికలు తమ ఇళ్ల నుంచి విద్యాలయాలకు రాకపోకలు సాగించాల్సిన అవసరం ఉండదని అధికారులు అంటున్నారు.

బాలికల వసతికి పెద్దపీట
కొయ్యూరులో నిర్మించిన కేజీబీవీ టైప్‌- 4 భవనం

- జిల్లాలో రూ.20 కోట్లతో భవనాల నిర్మాణం

- ఒక్కో భవనంలో 9 నుంచి ఇంటర్‌ చదివే వంద మంది బాలికలకు వసతి

- ఎనిమిది మండలాల్లో కేజీబీవీ టైప్‌-4 పేరిట వసతి కల్పన

- వచ్చే నెల నుంచి అందుబాటులోకి...

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో బాలికల విద్యకు, వసతి సదుపాయాల కల్పనకు సర్కారు పెద్దపీట వేస్తున్నది. ముఖ్యంగా ఇళ్ల నుంచి విద్యాలయాలకు రాకపోకలు సాగించే 9 నుంచి 12 తరగతులకు చెందిన బాలికలకు ప్రత్యేక వసతి సదుపాయం కల్పించాలని సమగ్ర శిక్ష అధికారులు భావించారు. దీంతో జిల్లాలో ఎంపిక చేసిన ఎనిమిది మండలాల్లో రూ.20 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా వసతి భవనాలను సమకూర్చుతున్నారు. ఫలితంగా రానున్న రోజుల్లో బాలికలు తమ ఇళ్ల నుంచి విద్యాలయాలకు రాకపోకలు సాగించాల్సిన అవసరం ఉండదని అధికారులు అంటున్నారు.

జిల్లాలోని బాలికలకు అవసరమైన ప్రత్యేక వసతి కల్పించేందుకు రూ.20 కోట్ల వ్యయంతో ఎనిమిది మండలాల్లో కస్తూర్బాగాంధీ విద్యాలయాలు టైప్‌- 4 పేరిట ప్రత్యేకంగా వసతి భవనాలను నిర్మిస్తున్నారు. జిల్లాలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, కొయ్యూరు, డుంబ్రిగుడ మండలంలో అరకు, జీకేవీధి మండలం సీలేరు, ముంచంగిపుట్టు మండలంలో జోలాపుట్టు, పెదబయలులోని ప్రభుత్వ/జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో వాటిని నిర్మిస్తున్నారు. ఒక్కో భవనానికి రూ.2.5 కోట్లు వ్యయం చేస్తూ వంద మంది బాలికలకు అన్ని రకాల సదుపాయాలతో కూడిన భవనాలను సమకూర్చుతున్నారు. భవిష్యత్తులో బాలికల వసతికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. దాదాపుగా ఆయా భవన నిర్మాణాలు తుది దశకు చేరడంతో నవంబరు నుంచి వాటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఏదైనా కారణాలతో పూర్తికాని ఒకటి రెండు భవనాలుంటే వాటిని సైతం డిసెంబరు నాటికి పూర్తి చేసి బాలికలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముమ్మరంగా పనులు చేపడుతున్నారు.

గిరిజన బాలికలకు తీరనున్న వసతి సమస్య

జిల్లాలోని 9 నుంచి 12 తరగతులు చదువుతున్న చాలా మంది గిరిజన బాలికలకు వసతి సమస్య తీరనుంది. ఏజెన్సీలో చాలా చోట్ల గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. కానీ ప్రభుత్వ/జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న అనేక మంది బాలికలు నేటికీ స్థానికంగా వసతి సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమ ఇళ్ల నుంచి లేదా తమ బంధువుల ఇళ్ల నుంచి విద్యాలయాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో రవాణా, భద్రతాపరంగా బాలికలు అవస్థలు పడుతున్నారు. సమగ్ర శిక్ష ద్వారా ప్రత్యేకంగా వసతి భవనాలను ఉన్నత పాఠశాలల ఆవరణలోనే నిర్మిస్తుండడంతో అటువంటి బాలికలకు ఇకపై అవస్థలు తప్పనున్నాయి.

Updated Date - Oct 09 , 2026 | 12:43 AM