Share News

చింతపల్లి అభివృద్ధికి ప్రాధాన్యం

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:20 AM

స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన చింతపల్లి, పరిసర ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహం, రూ.20 లక్షల జడ్పీ నిధులతో మరమ్మతులు చేసిన జిల్లా పరిషత్‌ అతిథి గృహాన్ని ప్రారంభించారు.

చింతపల్లి అభివృద్ధికి ప్రాధాన్యం
అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, మాజీ మంత్రి బాలరాజు, తదితరులు

మూడు మండలాల్లో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు

జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర

అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ

చింతపల్లి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన చింతపల్లి, పరిసర ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహం, రూ.20 లక్షల జడ్పీ నిధులతో మరమ్మతులు చేసిన జిల్లా పరిషత్‌ అతిథి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.10 కోట్లు కేటాయించామన్నారు. ఈ నిధులతో తాగునీటి పథకాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, శివారు గ్రామాలకు రహదారులు, సామాజిక భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మించామన్నారు. నిరుపయోగంగా పడివున్న ఇక్కడ జడ్పీ అతిథి గృహాన్ని రూ.20 లక్షలతో మరమ్మతులు చేయించామన్నారు. దీంతో ఒక సూట్‌ రూమ్‌, నాలుగు గదులు, డైనింగ్‌ హాల్‌ అందుబాటులోకి వచ్చినట్టు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో వివిధ మండలాల్లో వున్న జిల్లా పరిషత్‌ అతిథి గృహాలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొస్తున్నామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కృష్ణాపురంలో పదో తరగతి వరకు స్థాయి పెంచిన ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. లంబసింగిలో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం ఈ ప్రాంతానికి తలమానికం కానుందన్నారు. మ్యూజియం అందుబాటులోకి వస్తే లంబసింగికి ఏడాది పొడవునా పర్యాటకులు వస్తారని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే చింతపల్లి కేంద్రంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, జీసీసీ మాజీ చైర్‌పర్సన్‌ శోభ స్వాతిరాణి, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చింతపల్లి, జీకేవీధి ఎంపీపీలు కోరాబు అనుషదేవి, బోయిన కుమారి, జడ్పీటీసీ సభ్యులు పోతురాజు బాలయ్య, శివరత్నం, స్థానిక సర్పంచ్‌ దురియా పుష్పలత, టీడీపీ గ్రామ అధ్యక్షుడు రీమల ఆనందరావు, ఏఎంసీ డైరెక్టర్‌ పెదిరెడ్ల బేతాళుడు, ఎంపీడీవో సీహెచ్‌.సీతామహాలక్ష్మి, పీఆర్‌ ఏఈఈ బాలకిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 01:20 AM