అనకాపల్లి అభివృద్ధికి ప్రాధాన్యం
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:59 AM
మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అనకాపల్లి జోన్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పేర్కొన్నారు. స్థానిక గాంధీనగరం ఎస్‌ఆర్ శంకరన్ భవనంలో అనకాపల్లి జోన్ అభివృద్ధి పనులు, సమస్యలపై గురువారం ఆయన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జోనల్ కమిషనర్ చక్రవర్తి, కార్పొరేటర్లు, పలు విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తాం
ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ప్రస్తావించిన అంశాలను పరిగణనలోకి తీసుకొంటాం
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
జోనల్ కార్యాలయంలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడి
ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జోనల్ సమీక్షా సమావేశం
అనకాపల్లి టౌన్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అనకాపల్లి జోన్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పేర్కొన్నారు. స్థానిక గాంధీనగరం ఎస్‌ఆర్ శంకరన్ భవనంలో అనకాపల్లి జోన్ అభివృద్ధి పనులు, సమస్యలపై గురువారం ఆయన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జోనల్ కమిషనర్ చక్రవర్తి, కార్పొరేటర్లు, పలు విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వార్డు సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సూచనల మేరకు జీవీఎంసీని పది జోన్లుగా పునర్వ్యవస్థీకరణ చేసినట్టు చెప్పారు. అనకాపల్లి జోన్ అభివృద్ధికి సముచిత ప్రాధాన్యతం ఇస్తున్నట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, జోన్ పరిధిలోని కార్పొరేటర్లు ప్రస్తావించిన సమస్యలు, అభివృద్ధి పనులను పరిగణనలోకి తీసుకొని కార్యాచరణ చేపడతామన్నారు. విశాఖ సిటీలో మాదిరిగా అనకాపల్లిలో కూడా రాత్రిపూట పారిశుధ్య పనులను ప్రారంభిస్తామన్నారు. తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లు, పార్కులు, తదితర వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. టిడ్కో గృహాలకు సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించి లబ్ధిదారులకు రిజిస్ర్టేషన్ ప్రక్రియ జరుపుతామన్నారు. కార్యాలయంలోని వివిధ విభాగాల్లో వున్న ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని కమిషనర్ చెప్పారు. దోమల నివారణకు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడతామన్నారు. అనకాపల్లి జోన్ అభివృద్ధికి ఎమ్మెల్యే, కార్పొరేటర్ల సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని జోనల్ కమిషనర్ చక్రవర్తిని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు కొణతాల నీలిమ, మందపాటి సునీత, జాజుల ప్రసన్నలక్ష్మి, మాదంశెట్టి చినతల్లి, అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్‌వీ నరేశ్‌కుమార్, డీసీఆర్ ఎస్.శ్రీనివాసరావు, పట్టణ ప్రణాళిక అధికారి మీనాకుమారి, ఇంజనీరింగ్, ప్రజారోగ్య, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.